మ‌ళ్లీ రెచ్చిపోయిన కొడాలి.. బాబునే కాదు.. బాల‌య్య‌నూ వ‌ద‌ల్లేదుగా!

వైసీపీ నాయ‌కుడు, మంత్రి కొడాలి నాని.. మ‌ళ్లీ టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై రెచ్చిపోయారు. త‌న ధోర‌ణిలో ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ సారి కొడాలి.. ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను కూడా వ‌ద‌ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మాట్లాడిన కొడాలి నాని.. చంద్ర‌బాబును శ‌నిగ్ర‌హంతో పోల్చారు. అంతేకాదు.. బాల‌య్య‌ను ఏకంగా ఆట‌లో అర‌టి పండు అంటూ.. చిత్ర‌మైన కామెంట్లు కుమ్మ‌రించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందని.. ఆయనకు మైండ్‌ చెడిపోయిన విషయం అందరికీ తెలుసని విమర్శించారు.

చంద్రబాబు ఒక శనిగ్రహం అని, ఈ విషయం ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారని కొడాలి దుయ్య‌బ‌ట్టారు. శని దోషాలు వదలాలంటే చంద్రబాబు ఫోటో పెట్టుకొని పూజలు చేస్తే సరిపోతుందంటూ కౌంటర్ వేశారు. తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు మోదీని ప్రశ్నించలేక సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపైనా కొడాలి నాని కౌంటర్స్ వేశారు.

బాలకృష్ణ చిన్నపిల్లాడని.., ఆటలో అరటిపండు లాంటివాడని ఎద్దేవా చేశారు. సినిమా షూటింగుల కోసం ఇతర దేశాల్లో తిరుగుతారని.. పాటలకు మలేషియా, ఫైటింగులకు హాంకాంగ్ ఇలా దేశాలు పట్టుకొని తిరిగే వ్యక్తికి రాష్ట్రంలోని పరిస్థితులు ఏం తెలుస్తాయన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి.. కొడాలి కామెంట్ల‌కు బాల‌య్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. గ‌తంలో కొడాలిపై బాల‌య్య చాలా సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. రెచ్చ‌గొట్టొద్దంటూ.. వార్నింగ్ ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ఎలా స్పందిస్తారో.. ఆస‌క్తిగా మారింది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)