పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక అందులో చేరి ఆ పార్టీకి ఆకర్షణ తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఒకరు. దేశంలోనే గొప్ప పేరున్న పోలీసు ఉన్నతాధికారుల్లో ఒకడైన లక్ష్మీ నారాయణతో జనసేనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నారు. కానీ ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక కొన్ని నెలలకే జనసేన నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశం అయింది. సగటు రాజకీయ నాయకుల్లాగే ఆయన సైతం ఎన్నికల్లో పార్టీ దెబ్బ తిన్నాక కాడి వదిలేసి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. తన నిష్క్రమణకు లక్ష్మీనారాయణ చెప్పిన కారణం సైతం సహేతుకంగా అనిపించలేదు. పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడమే ఆయనకు అభ్యంతరంగా మారింది.
మిగతా రాజకీయ నాయకులందరూ తమ వ్యాపారాలను, ఆదాయ మార్గాలను విడిచిపెట్టనపుడు పవన్ న్యాయంగా సినిమాలు చేసి తన వ్యక్తిగత, పార్టీ అవసరాలకు డబ్బులు సంపాదిస్తానంటే అందులో తప్పేముందన్న ప్రశ్న ఎదురైంది. పైగా సినిమాల్లోకి పునరాగమనం చేశాక రాజకీయాలనేమీ పవన్ లైట్ తీసుకోలేదు. చాలా సీరియస్‌గానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. దీంతో జేడీ వాదన పూర్తిగా తేలిపోయింది. ఈ విషయంలో లక్ష్మీనారాయణ సైతం తన ఆలోచన మార్చుకున్నట్లే ఉన్నారు. ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలు రాబట్టడం పట్ల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు. జనసేనాని గురించి కూడా పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆయన్నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ ఊహించలేదు.
ఈ నేపథ్యంలో మీరు మళ్లీ జనసేనలోకి వెళ్తారా అని అడిగితే.. పవన్ కళ్యాణ్ అడిగితే ఈ విషయంలో పునరాలోచిస్తానని లక్ష్మీనారాయణ పేర్కొనడం విశేషం. జేడీ విషయంలో జనసైనికులు చాలా ఆగ్రహంతో ఉన్నారన్న సంగతి వాస్తవమే కానీ.. ఆయన జనసేనను విడిచిపెట్టాక మరో పార్టీలో ఏమీ చేరలేదు. అధికార పార్టీకి డప్పూ కొట్టలేదు. నేరుగా చెప్పకపోయినా జేడీ తాను చేసింది తప్పు అని భావిస్తున్నట్లే ఉంది తాజా వ్యాఖ్యల్ని చూస్తే. జేడీ వస్తే ఇప్పుడైనా కూడా పార్టీకి మంచిదే. పార్టీని విడిచి వెళ్లిపోయిన ఏడాదికే ఒక ప్రముఖ వ్యక్తి తిరిగి వస్తే సానుకూల సంకేతాలు ఇస్తుంది. కాబట్టి పవన్ ఇగోకు పోకుండా జేడీని ఆహ్వానిస్తే ఇరువురికీ మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates