బీజేపీకి భారీ సవాల్ విసిరిన పీకే.. మే2న చివరి ట్వీట్ చేస్తాడట

రాజకీయ పార్టీలకు సవాలు విసరటం పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కు అలవాటే. రాష్ట్రం ఏదైనా కావొచ్చు.. తాను ఒకసారి ఏదైనా రాజకీయ పార్టీకి సేవలు అందించటం మొదలుపెడితే చాలు.. వారిని విజయతీరాలకు తీసుకెళ్లే వరకు విశ్రమించరన్న పేరు ఆయన సొంతం. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గడిచిన కొద్దికాలంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్ కు సేవలు అందిస్తున్న ఆయన.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ.. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అందరి చూపు ఇప్పుడు పశ్చిమబెంగాల్.. తమిళనాడుల మీదనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే. తమిళనాడుతో పోలిస్తే పశ్చిమబెంగాల్ లోనే బీజేపీ బలం ఎక్కువ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ కోట మీద కాషాయ జెండా ఎగురవేయాలని తపిస్తున్న కమలనాథుల కలలు నిజం కావని స్పష్టం చేస్తున్నారు పీకే.

దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగే కీలక ఎన్నికల పోరాటాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటని చెప్పిన ఆయన.. బెంగాలీలు సొంత బిడ్డను మాత్రమే కోరుకుంటున్నారనే తృణమూల్‌ కాంగ్రెస్ నినాదాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ముఖ్యమంత్రి మమత చెప్పే ఈ ప్రముఖ నినాదాన్నిఆయన ట్విటర్ లో షేర్ చేయటం.. తన తుది ట్వీట్ మే2న చేస్తానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

రాబోయేఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ రెండు అంకెలకు మించి స్థానాల్ని గెలుచుకుంటే తాను ట్విటర్ నుంచి తప్పుకుంటానని డిసెంబరు 21న పీకే ట్వీట్ చేయటం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా మరోసారి తెర మీదకు తెచ్చిన ఆయన.. తాను గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 29 వరకు నెల రోజులకు పైనే ఎనిమిది దశల్లో సుదీర్ఘంగా బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితం మే2న వెలువడనుంది. మరి.. పీకే చెప్పింది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.