జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహానికి గురి కావటం.. భీమవరం వైసీపీ ఎమ్మెల్యేపై షాకింగ్ వ్యాఖ్యలు చేయటమే కాదు.. నేరుగా వార్నింగ్ ఇచ్చేయటం తెలిసిందే. దీనికి ఏ మాత్రం తగ్గని ఎమ్మెల్యే సైతం అంతే ఘాటుగా రియాక్టు అవుతున్నారు. జనసేన నాయకులు..కార్యకర్తలు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను చూసుకొని రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దళిత మహిళను సజీవ దహనం చేయాలని.. దళితుల ఇళ్లను తగలబెట్టాలని చూసినట్లుగా గ్రంధి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో రకరకాల వేషాలు వేస్తారని.. వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్టీ నాయకుడి తీరును బట్టే కార్యకర్తలు ఉంటారనటానికి జనసైనికుల తీరే నిదర్శనమన్నారు.
ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ.. భీమవరం ఎమ్మెల్యే ఆకు రౌడీలా వ్యవహరిస్తున్నారని.. ఆయన తీరు ఏ మాత్రం బాగోలేదని మండిపడుతున్నారు. ఇంతకూ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మత్స్యపురిలో ఏం జరిగింది? ఇంతటి ఉద్రిక్తతలకు కారణం ఏమిటి? అన్నది చూస్తే..
మత్స్యపురి సర్పంచిగా జనసేన మద్దతుదారు కారేపల్లి శాంతిప్రియ గెలిచారు. ఈ సందర్భంగా జనసేన నేతలు గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చటంతో నిప్పురవ్వలు ఒక తాటాకు ఇంటిపై పడి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న మరో దివ్యాంగురాలిపైన పడ్డాయి. అయితే.. జనసేన కార్యకర్తలు మంటల్ని ఆపేశారు.
ఆ తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ జనసేన – వైఎసీపీ మద్దతుదారుల మధ్య వివాదం మొదలైంది. ఈ విషయాన్ని తెలుసుకొని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వెళ్లి కార్యకర్తలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంట వచ్చిన వారు జనసేన కార్యకర్తలు.. వార్డు సభ్యుల ఇళ్లు.. వాహనాలపై దాడి చేసినట్లుగా జనసేన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. విషయం అంతకంతకూ ఉద్రికత్తలకు మారటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. దళితుల ఇళ్లకు నిప్పు పెట్టారనంటూ జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టాలని వైసీపీ.. దొంగ కేసుల్ని పెట్టాలని ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మత్స్యపురి గ్రామంలో ఉద్రిక్తతల్ని చల్లారేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు పవన్ కల్యాణ్ కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates