నిన్న మొన్నటి వరకు.. తనకు కులాలను అంటగట్టవద్దని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరావేశంలో చెప్పుకొచ్చారు. తాను అభినవ రాజకీయ నేతనని.. తనకు ఏ కులమూ.. మతమూ లేదని కూడా ఆయన వెల్లడించారు. తనను కులం అనే రాటకు కట్టేస్తారా? ఇంత సంకుచితంగా చూస్తారా? అంటూ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన ఏ కులం వద్దు.. తనకు ఏ రంగు పూయవద్దు.. అన్నారో.. అదే కులం ఆయనను నెత్తిన పెట్టుకుంది. అదేసామాజిక వర్గం.. ఆయన పార్టీని భుజాలపైకి ఎక్కించుకుంది.
ఔను! ఇప్పుడు కాపు సామాజిక వర్గం జనసేన పరువును నిలబెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో జనసేన నిలిచి.. పరువును నిలబెట్టుకుందంటే.. కేవలం కాపు సామాజిక వర్గం అండతోనే! ఇది నిర్వివాదాంశం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.. కాపులు ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరిలో తాజాగా తన పార్టీమద్దతు దారులుగా గెలిచిన వారికి సన్మానాలు చేయడమే! అంటే.. దీనిని బట్టి.. పవన్ ఎంత కాదనుకున్నా.. కాపులే ఇప్పుడు అండగా నిలిచారని పరోక్షంగా అంగీకరించడమే!!
ఉభయ గోదావరి జిల్లాలలోని కాపు సామాజిక వర్గం రెండో మాట లేకుండా జనసేన వైపు నిలబడింది. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో జనసేన పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయినప్పటికీ.. నెల్లూరు సహా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని చాలా పంచాయతీల్లో జనసేన మద్దతు దారులు విజయం సాధించారు. నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను విశ్లేషిస్తే.. జనసేన అభ్యర్థులను గెలిపించింది కేవలం కాపు సామాజిక వర్గమే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో కాపులను ఇప్పటికైనా సంపూర్ణంగా ఓన్ చేసుకోవాల్సిన అవసరం పవన్‌కు ఏర్పడింది. అంతేకాదు.. పవన్ ఇప్పుడు టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత ఎన్నికలప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు కాపులు క్లారిటీ ఇచ్చారు. టీడీపీని ఒకప్పుడు విశ్వసించి పట్టగట్టిన కాపులు.. తూర్పులో ఇప్పుడు జనసేనపై నమ్మకం పెట్టుకున్నారు. అదేవిధంగా.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన కాపులు ఇప్పుడు స్థానికంలో వచ్చిన ఫలితాన్ని బట్టి.. ఆపార్టీని కూడా దూరం పెట్టారనిస్పష్టమవుతోంది. సో.. ఏతావాతా ఎలా చూసుకున్నా.. కాపులు జనసేన వైపు నిలబడ్డారు. మరి పవన్ వారివైపు నిలబడతారా? లేదా? చూడాలి ఏం జరుగుతుందో.
Click Here for Recommended Movies on OTT (List Updates Daily)