విశాఖ ఉక్కు విషయంలో రాజీనామా చేసిన టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బరిలోకి లాగుతున్నారా ? తాజాగా గంటా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. కేంద్రం తీసుకున్న ఉక్కు ప్రవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ బరిలోకి దిగాలని డిమాండ్ చేశారు. బీజేపీని వదిలిపెట్టేసి పవన్ విడిగా ఆందోళనల్లోకి దిగాలని గట్టిగా సూచించారు. పవన్ను మాత్రమే గంటా బరిలోకి లాగటం లేదు. మొత్తం సినీపరిశ్రమంతా స్పందించాలని చెప్పారు.
ఉక్కు పరిశ్రమపై కేంద్రం తీసుకున్న నిర్ణయం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు విచిత్రంగా ఉందన్నారు. ఖైదీ మెడకు ఉరితాడును గట్టిగా బిగించేసి ఉరిశిక్షపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నట్లుగా ఉందని కేంద్రం నిర్ణయాన్ని, బీజేపీ నేతల మాటలను గంటా అభివర్ణించారు. ఇప్పటికే మూడుసార్లు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన గంటా ఇంతకాలం ఎవరి గురించి ప్రస్తావన తేలేదు.
అయితే ఇపుడు మాత్రం ఒకేసారి ఇటు బీజేపీ అటు పవన్+సినీపరిశ్రమను ఆందోళనల్లోకి లాగటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి మాట్లాడుతున్నారు కాబట్టి గంటా వ్యాఖ్యలకు కాస్త విలువుంటుందన్న విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. పార్టీ లైనును కూడా కాదని, చంద్రబాబునాయుడు ఆదేశాలను కూడా ధిక్కరించి మరీ గంటా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
మరి గంటా చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కానీ లేకపోతే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే. ఎందుకంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించలేక అలాగని బహిరంగంగా వ్యతిరేకించ లేక బీజేపీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా రోడ్డు మీదకు వచ్చి ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు ప్రకటించలేదు. ఎందుకంటే అప్పుడు టీడీపీతో ఇపుడు బీజేపీ చేరటం వల్ల పాపం ప్రశ్నించటమే మరచిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates