ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు వేగంగా పావులు కదపటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బాధ్యత మీదంటే మీదంటూ ఏపీ అధికార.. విపక్ష నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవటం తెలిసిందే. మీ వైఫల్యం వల్లే ఇదంతా అని ఇరు పక్షాలు పోటీపడి మరి తిట్టేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తే.. ఆయన వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా అచ్చెన్న పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం జగన్ వెంట నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే అందరం కలిసి రాజీనామా చేద్దామని పిలుపునిచ్చారు. ఉక్కుపోరులో ఎంపీలు రాజీనామా చేస్తే.. వారి స్థానాల్లో పోటీ పెట్టబోమని అచ్చెన్న హామీ ఇచ్చారు.
ఓవైపు జగన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమన్న అచ్చెన్న.. మరోవైపు ఆయనపై పలు విమర్శలు.. ఆరోపణలు చేయటం గమనార్హం. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కర్త.. కర్మ.. క్రియ మొత్తం ముఖ్యమంత్రి జగనేనని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉక్కు ఉద్యమాన్ని మరింత పెద్దది చేస్తామన్నారు. మరి..దీనికి వైసీపీ నేతల స్పందన ఏమిటో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates