సైకిల్‌కు క‌ష్టాలు: చిత్తూరులో ఇంత జ‌రుగుతున్నా.. బాబు మౌనం..

ఔను! చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ వేస్తున్న అడుగులు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే. పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఈ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జిల్లాలో ఈ పార్టీనే న‌మ్ముకుని ఉన్న కొంద‌రికి మాత్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తుతోంది.

రెండు కీల‌క ప్రాంతాల్లో వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక‌టి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో మంత్రి రామ‌చంద్రారెడ్డి, ఎంపీ రెడ్డ‌ప్ప‌లు.. దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు.

ఫ‌‌లితంగా సంస్థాగ‌తంగా ఉన్న టీడీపీ కేడ‌ర్ ఇప్పుడు వైసీపీ అనుకూలంగా మారుతోంది. కుప్పంను మినీ మునిసిపాలిటీగా నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఇక్క‌డ పోటీ చేసేందుకు వైసీపీ అభ్య‌ర్థులు పోటీ పడుతున్నారు. అయితే.. అదే స‌మ‌యంలో.. టీడీపీ మ‌ద్ద‌తు దారులుగా పోటీ చేసేందుకు నామ మాత్రంగానే అభ్య‌ర్థులు ముందుకు వ‌స్తున్నారు. ఇక‌, మ‌రోవైపు.. చంద్ర‌బాబు సొంత గ్రామం నారావారిప‌ల్లె. ఇది చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉంది. ఇక్క‌డ గ‌త 2013 పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీ కైవసం చేసుకుంది. అయితే.. ఇప్పుడు ఇక్క‌డి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి.. మాత్రం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

నారావారి ప‌ల్లెలో వైసీపీ మ‌ద్ద‌తు దారుల‌తో భారీ ఎత్తున ప్ర‌చారం చేయిస్తున్నారు. గ‌ట్టిగా ప‌ట్టున్న నాయ‌కుల‌ను ఎంపిక కూడా చేసినట్టు తెలుస్తోంది. రెండో ద‌శ‌లో జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌ద్ద‌తు దారులు గెలుపు గుర్రం ఎక్కేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. అటు కుప్పంలోను, ఇటు త‌న సొంత గ్రామం నారావారిప‌ల్లెలోను.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. చంద్ర‌బాబు మాత్రం స్థానిక నేత‌ల‌పైనే భారం వేసి.. త‌ప్పుకొంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ కీల‌క‌స‌మ‌యంలో ఆయ‌న ఇత‌ర ప్రాంతాల వారితో చేసిన‌ట్టు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి వ‌దిలేస్తే.. ఎలా? అనేది ఇక్క‌డి నేత‌ల ప్ర‌శ్న‌. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు మాత్రం నిత్యం ట‌చ్‌లో ఉంటూ.. వైసీపీని ముందుకు న‌డిపిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.