చిన్నమ్మకు మళ్ళీ జైలు జీవితం తప్పదా ?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెల్లి, చిన్నమ్మగా ప్రచారంలో ఉన్న శశికళకు మళ్ళీ జైలు జీవితం తప్పేలా లేదు. ఆదాయినికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్షను మొన్ననే పూర్తి చేసుకుని చిన్నమ్మ బెంగుళూరులోని పరప్పన జైలు నుండి విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాత కేసుల్లో కొన్నింటిని దర్యాప్తు జరిపించి మళ్ళీ చిన్నమ్మను జైలుకు పంపటానికి ఏఐఏడీఎంకే ప్రభుత్వం రంగం రెడీ చేస్తోందని సమాచారం.

జైలునుండి విడుదల కాగానే శశికళ కాస్త ఓవర్ యాక్షన్ చేశారనే చెప్పుకోవాలి. ఏఐఏడీఎంకే పార్టీ తనదే అని, పార్టీకి తానే శాశ్వత ప్రధానకార్యదర్శినని ప్రకటించుకున్నారు. పార్టీ గుర్తు రెండాకులు తనకే చెందాలంటు సుప్రింకోర్టులో కేసు వేయించారు. నిజానికి పార్టీతో శశికళకు ఎలాంటి సంబంధం లేదు. ద్రవిడ కజగంలో నుండి (డీకే) ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) ఏర్పాటయ్యింది. డీఎంకేలో నుండి అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం (ఏఐఏడీఎంకే) ఆవిర్భవించింది.

ఏఐఏడీఎంకేను స్ధాపించింది ఎంజీఆర్. తర్వాత ఆ పార్టీకి జయలలిత అధినేత్రి అయ్యింది. ఏఐఏడీఎంకేలో ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినపుడు ప్రధాన కార్యదర్శిగా జయే ఉన్నారు. అయితే తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ శెల్వంను నియమించారు. జయ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఎం. పళనిస్వామి సీఎం అయ్యారు. జయ తర్వాత తానే సీఎం అవ్వాలని వేదిక రెడీ చేసుకున్న శశికళ చివరినిముషంలో జైలుకెళ్ళారు.

ఎప్పుడైతే చిన్నమ్మ జైలుకు వెళ్ళారో అప్పుడే ఆమెను పార్టీలో నుండి బహిష్కరించారు. అంటే శశికళకు ఏఐఏడీఎంకేకు ఏమీ సంబంధం లేదు. అలాంటిది జైలు నుండి విడుదల కాగానే పార్టీ తనదే అని, శాశ్వత ప్రధాన కార్యదర్శి తానే అని చిన్నమ్మ ప్రకటించుకోవటమే విచిత్రంగా ఉంది. ఈ నేపధ్యంలో శశికళ ఎక్కువ రోజులు బయటుంటే తమకు తలనొప్పులు తప్పవని అధికారపార్టీకి అర్ధమైపోయింది. అందుకనే పాత కేసులను తవ్వి మళ్ళీ జైలుకు పంపేందుకు ప్లాన్ జరుగుతోందట.

ఈనెల 20వ తేదీన ఢిల్లీలో ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభోత్సం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, పన్నీర్ శెల్వంతో పాటు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే శశికళ విషయాన్ని మోడితో మాట్లాడేందుకు ప్లాన్ చేశారట. ఒకవేళ మోడి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చిన్నమ్మపై ఉన్న పాత కేసులను తవ్వి బయటకు తీసి మళ్ళీ జైలుకు పంపటం ఖాయమనే అనిపిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.