సినీ గేయ రచయిత, సామాజిక స్పృహ మెండుగా ఉన్న యువ కవి.. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు గురువారం సాయంత్రం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇరువురు పార్టీ కండువాలు కప్పుకొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆధ్వర్యంలో వీరిద్దరూ జనసేన పార్టీలో చేరారు. వీరిని స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతించారు. పార్టీలో చేరిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ మంచి పనితీరుతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.
ముఖ్యంగా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు పవన్ కల్యాణ్ నడుంబిగించినట్టు కనిపిస్తోందన్నారు. గ్రామాభ్యుదయమే లక్ష్యంగా ఆయన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.. “నాకు అనేక మంది ఫోన్ చేశారు. రాష్ట్రంలో గ్రామాలు బాగుపడుతున్నా యని చెప్పారు. ఆ తర్వాత నేను కూడా స్వయంగా రాష్ట్రంలో పలు చోట్ల తిరిగానే. స్వయంగా పరిశీలించా. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడుతున్నాయి. రహదారులు నిర్మిస్తున్నారు. నీటిని అందిస్తున్నారు. ఇదంతా పవన్ కల్యాణ్ చొరవతోనేనని గ్రామస్థులు చెప్పారు“ అని అన్నారు. పవన్ కల్యాణ్ పనితీరు నచ్చి.. తన తల్లిదండ్రులు ఉమారాణి, వీరవెంకట సత్యనారాయణ మూర్తిలు జనసేనలో చేరారని తెలిపారు.
తన తల్లి ఉమారాణి.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ కూడా చేయనున్నట్టు అనంతశ్రీరామ్ వెల్లడించారు. పశ్చిమ గోదావరిలో యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ గా తన మాతృమూర్తి పోటీ చేస్తారని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. పార్టీ పరంగా జనసేన గురించి తమ ఫ్యామిలీలో కొన్నాళ్లుగా చర్చ నడుస్తోందన్నారు. ఇక, తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ.. తాను తటస్థంగానే ఉంటానని చెప్పారు. ప్రజలు, గ్రామాలు, నగరాలు బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. వ్యక్తిగతంగా సినీ రంగంలో సంతృప్తిగా ఉన్నానని.. సాహిత్య సేవ తనకు నచ్చిన రంగమని అనంత శ్రీరామ్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates