ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు రేవంత్ ప్లాన్ చేస్తున్నారా?!

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఒక‌వైపు కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త‌కుమ్ములాట‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు… అధికార పార్టీ నేత‌లు వ‌ర్సెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. `ఏదో వ్యూహాత్మ‌క రాజ‌కీయం`  తెర‌వెనుక న‌డుస్తోంద‌న్న చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాలు స‌హా.. స‌గానికి పైగా ప‌ట్ట‌ణాల్లో సీఎం రేవంత్ రెడ్డి హ‌వా క‌నిపిస్తోంద‌న్న‌ది తాజాగా చేసిన అంత‌ర్గ‌త స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ ప్ర‌భావం నేప‌థ్యంలోనే రేవంత్ రెడ్డి గ‌త మూడు మాసాలుగా బీఆర్ ఎస్‌పై మ‌రింత గ‌ట్టిగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

దీంతోపాటు.. స్థానికంగా ఆయ‌న చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌జ‌లు మొబిలైజ్ అవుతున్న తీరు.. వంటివి గ‌మ‌నిస్తే.. రాజ‌కీయంగా ఏదో మార్పు దిశ‌గానే అడుగులు వేస్తున్నార‌ని విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విష‌యంలో గ‌త రెండున్న‌రేళ్లు మూడేళ్ల కాలంలో కాంగ్రెస్‌పార్టీకి, మ‌రీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్టుల ప్ర‌క‌ట‌న‌లు.. అదేస‌మ‌యంలో పెట్టుబడుల ఆహ్వానం, స‌ద‌స్సులు వంటివి త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ ఇంకా గ్రౌండ్ కాలేదు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు, అవ‌గాహ‌న ఒప్పందాల ద‌శ‌లోనే ఉన్నాయి.

మ‌రోరెండేళ్ల పాటు ప్ర‌భుత్వానికి స‌మయం ఉంది. అయితే.. అప్ప‌టికి బీఆర్ఎస్ పుంజుకునే అవ‌కాశం ఉంది. అలానే.. బీజేపీ కూడా వ్యూహాత్మ‌క రాజ‌కీయాల‌ను పెంచుతోంది. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌ను కూడా ఇటీవ‌ల మార్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ పుంజుకునేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉన్నా.. రాబోయే మూడు నాలుగు మాసాల్లో ఆయ‌న కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక‌, చిన్న‌చిత‌కా పార్టీల ప్ర‌భావం.. ప్రాభ‌వం కూడా ఉంటుంద‌న్న అంచ‌నాలు వున్నాయి.

ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచార‌ని తెలుస్తోంది. అయితే.. ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్లాన్‌లో ఉన్నార‌న్న చ‌ర్చ ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ వ‌ర్గాల్లోనే తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. “ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. ఏమైనా జ‌ర‌గొచ్చు. ముంద‌స్తు కు వెళ్ల‌కుండా ఎలాంటి నియ‌మం లేదు. రేవంత్‌రెడ్డి అభీష్టాన్ని పార్టీ గౌర‌విస్తుంది“ అని సీనియ‌ర్ నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం మునిసిప‌ల్‌, స్థానిక ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్‌కు మంచి హ‌వా క‌నిపించ‌డం, రేవంత్ రెడ్డి గ్రాఫ్ ప‌దిలంగా ఉండ‌డం వంటి కార‌ణాల‌తో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న సామెత రీతిలో ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.