ఏపీ బీజేపీలో కొన్నాళ్లుగా అసంతృప్తితోనే నాయకులు ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఏం జరుగుతోందో.. తమకు అర్థం కావడం లేదని కొన్నాళ్లుగా నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల వ్యవహారం మరింతగా నాయకులకు అసంతృప్తిని రాజేసింది. ఈ క్రమంలో బీజేపీ కీలక నాయకుడు, ఎమ్మెల్యే చడిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించడం మరింత సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఆది విజయం దక్కించుకున్నారు. అనంతరం.. ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
మరోవైపు.. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల వ్యవహారంపై కూడా ఆది నారాయణ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయిస్తారని ఆదినారాయణ రెడ్డి ఆశించారు. ముఖ్యంగా జడ్పీటీసీగా గెలిచిన తన తమ్ముడి కుమారుడు రాజేష్ రెడ్డికి ఈ పదవి ఇప్పించాలని ఆయన ప్రయత్నించారు. అయితే కూటమి పార్టీలు ఆ పదవిని టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి కేటాయించారు. ఈ పరిణామమే ఆదికి ఆగ్రహం తెప్పించింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే తన కుటుంబ సభ్యులకు జెడ్పీ ఛైర్మన్ పదవి ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, అందుకే వారిని బరిలోకి దింపానని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. తీరా ఇప్పుడు హామీ నిలబెట్టుకోకుండా తమకు అన్యాయం, మోసం చేశారని చెబుతున్నారు. మరోవైపు.. జగన్‌కు అండగా ఉన్న పులివెందుల వంటి ప్రాంతాల్లో తాను స్వయంగా ప్రచారం చేసి 7 జడ్పీటీసీ స్థానాలు, 2 మున్సిపాలిటీలలో కూటమి విజయానికి కృషి చేశానని ఆది చెబుతున్నారు. అయినప్పటికీ.. తన కష్టాన్ని గుర్తించడం లేదని చెబుతున్నారు. తమకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బుజ్జగింపులు..
ఆది తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేసిన దరిమిలా.. బీజేపీ అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర చీఫ్ మాధవ్.. ఆదిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుందని, కూటమి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా ప్రతిపాదనే సరికాదని ఆయన వివరించారు. అయితే.. ఆది ఎక్కడా మెత్తబడినట్టు కనిపించడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates