ప్రజల నాడిని పట్టడంలో బీజేపీ-జనసేన ఐక్య కూటమి విఫలమైందా? ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయలేక పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి.. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను రంగంలోకి దింపాలని ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి ఆమెను సంప్రదించే పనిని కూడా వేగం చేశారు. అయితే.. ఈ విషయంలో గత ఎన్నికల అనుభవం ఏం చెబుతోందన్నది కీలకంగా మారింది. గతంలో 2019 ఎన్నికల్లో ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగులకు చాలా పార్టీలు టికెట్లు ఇచ్చాయి. అయితే.. వారంతా ఓడిపోయారు. దీనికి ప్రధాన కారణం.. ప్రభుత్వం పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చేసరికి .. ప్రజలతో మమేకం కావడం ముఖ్యం.
ఈ విషయంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగులుగా గుర్తింపు ఉన్న వారు గత ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి దిగినా.. ప్రజలు వారిని ఓన్ చేసుకోలేక పోయారు. అధికారులకు-ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ కావొచ్చు.. లేదా మరేదైనా విషయం కావొచ్చు. విశాఖ పట్నం పార్లమెంటు స్థానం నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
ఇక, వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్ పరిధిలో పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి చంద్రగిరి ఏసురత్నం పరిస్థితి కూడా ఇంతే. అదేవిదంగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ అధికారి.. మహమ్మద్ ఇక్బాల్ కూడా పరాజయం మూటగట్టు కున్నారు. ఇక, 2014లో విజయం సాధించిన మాజీ ఐఆర్ ఎస్ అధికారి రావెల కిశోర్ బాబు.. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు.
అదేసమయంలో డాక్టర్లుగా ఉండి.. పొలిటీషియన్లుగా రంగంలోకి దిగిన వారు విజయం సాధించడం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తే.. గతానికి భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. అధికారులకు అవకాశం ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలూ అంతర్గత మథనం చేస్తున్నాయి. కానీ, ఇప్పుడు జనసేన-బీజేపీ ద్వయం మాత్రం మళ్లీ మాజీ ఐఏఎస్ అధికారిణిని రంగంలోకి దింపేందుకు, అందునా.. కీలకమైన తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధపడడం అంటే.. కోరి కోరి .. ఓటమిని కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ విషయంలో తమ ఆలోచనను ఇలానే కొనసాగిస్తారో.. లేక ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారో చూడాలని అంటున్నారు.