గెలుపుకు ప్రణాళికలు రెడీ అయ్యాయట

ఆలూ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న సామెతలాగుంది సోమువీర్రాజు, పవన్ కల్యాణ్ ప్రకటన. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భేటి అయ్యారు. చాలాసేపు జరిగిన భేటిపై వీర్రాజు ట్విట్టర్లో కొన్ని పాయింట్లను షేర్ చేశారు. తొందరలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో అభ్యర్ధి అంశంతో పాటు రాజకీయ పరిస్ధితులపై చర్చించినట్లు చెప్పారు.

సరే ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ నుండి అభ్యర్ధి దిగినా ఉభయపార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతామని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ? మిత్రపక్షాలన్నాక ఏదో ఒక పార్టీ నుండే అభ్యర్ధి పోటీ చేస్తారని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వీర్రాజు, పవన్ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది ? ఇదే విషయాన్ని ఇద్దరు పదే పదే చెబుతుండటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించటంతోనే పై సామెత గుర్తుకొస్తోంది. ఎందుకంటే విడివిడిగా పోటీచేస్తే రెండు పార్టీలకు కనీసం డిపాజిట్ సాధించటం కూడా అనుమానమే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 16500. జనసేన బలపరచిన బిఎస్పీ అభ్యర్ధికి వచ్చింది 20 వేల ఓట్లు. రేపటి ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి పోటి చేస్తే మహాఅయితే ఇంకొన్ని ఓట్లు ఎక్కువస్తాయేమో అంతే.

రేపటి ఎన్నికల్లో బీజేపీ+జనసేన ఉమ్మడి అభ్యర్ధి రంగంలోకి దిగి, రెండుపార్టీల నేతలు చిత్తశుద్దితో గెలుపుకు కృషిచేస్తే మహా అయితే రెండోస్ధానానికి వస్తే అదే చాలా ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన దివంగత వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటినే 2.28 లక్షల ఓట్లు. రెండోస్ధానంలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి వచ్చిన ఓట్లు సుమారు 4.8 లక్షల ఓట్లు.

ఇలాంటిది బీజేపీ+జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్ధి గెలిచిపోతాడని వీర్రాజు చెబితే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మిత్రపక్షాల ఆరాటం అంతా దేనికంటే రెండోస్ధానంకు రావటానికే అని స్పష్టంగా తెలిసిపోతోంది. రెండు పార్టీల వాస్తవ బలం వీర్రాజు, పవన్ కన్నా స్దానికంగా ఉన్న నేతలకే బాగా తెలుసు. కాబట్టి ఏదో కతలు చెప్పటం కాకుండా వీర్రాజు, పవన్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది.