తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని మీడియా సంస్థలు ఉన్నా.. కొన్ని మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే.. ఏ మీడియా సంస్థ అధినేత కూడా స్వయంగా పెన్ను పెట్టి (కంప్యూటర్లు వచ్చినా.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే మాత్రం పేపరు మీద పెన్నుతోనే చిన్న చిన్న అక్షరాలు కలేసినట్లుగా.. అదేనండి కాసింత గొలుసుకట్టులో ఆయన అక్షరాలు ఉంటాయని చెబుతారు) రాసే ఏకైక యజమాని ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రమే. తొలి నుంచి పొలిటికల్ రిపోర్టర్ అయిన ఆయన.. తన కెరీర్ ఆరంభంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్ని చూసేవారు.
ఆయన ఉద్యోగిగా పని చేసిన పాత ఆంధ్రజ్యోతిలోనూ ఆయన రాసిన రాజకీయ కథనాలకు మంచి ఆదరణ ఉండేది. తాను రిపోర్టర్ గా ఉన్నప్పుడు కూడా చుట్టు ఉన్న వారితో తక్కువగా మాట్లాడతారని.. ఆఫీసుకు రావటం.. తన పని ఏదో సీరియస్ గా చేసుకోవటం.. వెళ్లిపోవటం లాంటివి చేసే వారంటారు. అదే అలవాటు తాను పని చేసిన పత్రికకు యజమాని అయిన తర్వాత కూడా విడవలేదని చెబుతారు. ఇప్పటికి శనివారం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే పేపరు.. పెన్ను తీసుకొని.. ఏకాంతంగా రెండున్నర గంట పాటు కూర్చుంటారని.. తాను రాసిన కాపీని తన ముఖ్య సిబ్బందికి పంపి.. అక్కడ ఎడిట్ చేయిస్తారని చెబుతారు.
కాకుంటే.. ఆయన రాసిన దాన్లో తప్పులు దాదాపుగా ఉండవని.. కాకుంటే కాస్త ఆవేశంగా రాసే అంశాల్ని.. ముఖ్య ఉద్యోగులు టోన్ డౌన్ చేస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. యజమానిగా మారిన తర్వాత కూడా.. తలకు మించిన పనులు చుట్టూ ఉన్నప్పటికి.. రాతను మాత్రం ఆయన వదిలిపెట్టకపోవటం ఆర్కే ప్రత్యేకతగా చెబుతారు. తనకున్న విశేష పరిచయాలతో చాలా విషయాల్ని నాలుగు గోడలు దాటకుండానే సంపాదించే ఆయన.. అవసరానికి తగ్గట్లు తన అమ్ముల పొదిలో నుంచి సమాచారాన్ని తీసి సంధిస్తుంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన కొత్త తరహా ప్రచారాన్ని షురూ చేశారు. ఆయనకు.. ఆయన సోదరి షర్మిలకు ఏ మాత్రం పొసగటం లేదన్న కథనాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు.. ఇంతకాలం తన రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడి.. వేటాడిన జగన్ తాజాగా స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ అక్షర అస్త్రాన్ని సంధించారు. ఇంతకు ఆర్కే ఏం చెప్పారు? ఆయన వాదన ఏమిటన్నది ఆయన మాటల్లోనూ యథాతధంగా చెబితే..
”ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారా? అన్న అనుమానం కలుగుతున్నది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిపై ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన బదిలీకి కారకుడైన జగన్ రెడ్డి, దానివల్ల కలిగిన ప్రయోజనాన్ని అనుభవించకుండానే మళ్లీ రాజ్యాంగ వ్యవస్థలతో అసాధారణ రీతిలో తలపడుతున్నారు. నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధపడగా, ఎన్నికలకు సహకరించేది లేదని జగన్ ప్రభుత్వం భీష్మించుకొని కూర్చోవడం దేనికి సంకేతం?”
”ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకుండా సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కట్టడి చేశారు. తన జేబు సంస్థలుగా మారిన ఉద్యోగ సంఘాలతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల కమిషన్‌కు సహకరించబోమని చెప్పించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వస్తుంది. ఈలోపు ఎన్నికల కమిషన్ ఆదేశాలను బాహాటంగానే ధిక్కరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రారంభమయ్యాక రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం సాగదనీ, ఎన్నికల కమిషన్‌కే సర్వాధికారాలూ ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం గతంలో విస్పష్ట తీర్పు ఇచ్చినా జగన్ ప్రభుత్వం దాన్ని కూడా ధిక్కరిస్తోంది”
”ఈ పరిణామంతో హైకోర్టుకే కాదు, సుప్రీంకోర్టుకు కూడా తన నైజం ఏమిటో తెలిసేలా జగన్ రెడ్డి చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల కమిషనే సుప్రీం అని తెలిసి కూడా ఐఏఎస్ అధికారులు సైతం ముఖ్యమంత్రికి భయపడి ఆయన చెప్పినట్టు నడుచుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. సంబంధిత అధికారులు ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రభుత్వ న్యాయ సలహాదారులు కూడా నిస్సహాయంగా ఉండిపోవడం నిజంగా విషాదం! అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వ్యవహార శైలి న్యాయాధికారుల్లోనే కాదు, న్యాయ నిపుణుల్లో కూడా విమర్శలకు దారితీస్తోంది”
”ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తన ప్రభుత్వానికి అనుకూలంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేయడంతో, అది ఇష్టంలేని ఆనాటి అడ్వొకేట్ జనరల్ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే హైకోర్టుగానీ, ఎన్నికల కమిషన్‌గానీ మరేదైనా రాజ్యాంగబద్థమైన సంస్థ అయినా సరే, తన ప్రభుత్వానికి లోబడే వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా కుదరదు. ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారు? సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతున్నది? అన్నది వేచి చూడాలి”