క్రాక్, వీరసింహారెడ్డి, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్లతో కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న గోపిచంద్ మలినేని నిన్న జాట్ విడుదలతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. గదర్ 2 ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్నో కథలు, ఎందరో నిర్మాతలు వచ్చినా హీరో సన్నీ డియోల్ మన తెలుగు నిర్మాతలు మైత్రి, పీపుల్స్ మీడియాకు ఎస్ చెప్పడం అక్కడి పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పైగా ఇదే ముందు మాస్ మహారాజా రవితేజతో చేయాలనుకున్న కథగా ప్రచారం జరగడం తెలుగు జనాల్లోనూ ఆసక్తి రేపింది. ప్రాథమికంగా వినిపిస్తున్న టాక్ చూస్తుంటే జాట్ ఉత్తరాది బిసి సెంటర్లలో వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది.
కంటెంట్ పరంగా మలినేని రిస్క్ చేయలేదు. సేఫ్ గేమ్ ఆడాడు. టాలీవుడ్ ఫార్ములాని వాడుకున్నాడు. శ్రీలంక నుంచి ప్రకాశం జిల్లాకు వలస వచ్చిన రణతుంగ (రణదీప్ హుడా) అనే దుర్మార్గుడు ప్రకాశం జిల్లా మెట్టుపల్లి గ్రామాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకుని కోట్లకు పడగలెత్తుతాడు. అనుకోకుండా రైలు బ్రేక్ డౌన్ వల్ల అక్కడికి వచ్చిన బల్బీర్ ప్రతాప్ సింగ్ (సన్నీ డియోల్) కు రణతుంగ అనుచరులతో చిన్న సారీ విషయంగా గొడవ ఏర్పడి చిలికి చిలికి గాలివానగా మారుతుంది. కనికరం ఏ కోశానా లేని ఆ రాక్షసుడికి బల్బీర్ ఎలా బుద్దిచెప్పాడనే పాయింట్ తో మొదటి నుంచి చివరి నుంచి మాస్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది.
సన్నీ డియోల్, ఇద్దరు విలన్లు మినహా అధిక శాతం తెలుగు ఆర్టిస్టులే జాట్ లో కనిపిస్తారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ఘోష్, రెజీనా ఇలా పెద్ద క్యాస్టింగ్ నిండిపోయింది. హీరో ఎంట్రీ పాతిక నిమిషాల తర్వాత జరగడం, సెకండాఫ్ లో పావు గంటకు పైగా సన్నీ మాయమైపోవడం లాంటి బలహీనతలు జాట్ స్థాయి మీద ప్రభావం చూపించాయి. సన్నీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బిజిఎం, భారీ నిర్మాణ విలువలు, రొటీన్ గా ఉన్నా బలమైన మాస్ ఎపిసోడ్స్ ఈ జాట్ ని మరీ బ్యాడ్ కాకుండా కాపాడాయి. గతంలో చాలా చేశాడు కాబట్టి జాట్ రవితేజతో తీసుంటే ఇంకో రెగ్యులర్ మూవీ అయ్యేది. సన్నీకి హిట్టవ్వొచ్చేమో కానీ గదర్ 2 స్థాయి అయితే కాదు.