జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి తిరిగి వచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ ను పవన్ తన భుజాన ఎత్తుకుని మరీ ఎస్కలేటర్ నుంచి దిగుతూ కనిపించారు. పవన్ ముందు ఆయన సతీమణి లెజినోవా కూడా ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా…సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా… అగ్ని కీలక నేపథ్యంలో ఎగసిన పొగలను పీల్చిన మార్క్… శ్వాస సంబంధిత సమస్యతో ఒకింత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్…మొన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఆ తర్వాత ఓ రోజు పాటు సింగపూర్ లోనే మార్క్ కు రెస్ట్ ఇచ్చిన పవన్… శనివారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. కొడుకుని పొదివి పట్టుకుని మరీ.. తన భుజంపై అతడిని కదలకుండా జాగ్రత్తగా పట్టుకుని తిరిగి వస్తున్న పవన్ ను చూసిన ఆయన ఫ్యాన్స్, జనసైనికులు తమదైన శైలి కామెంట్లు పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates