ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త కథలు వచ్చేవి. గొప్ప గొప్ప ప్రయోగాలు జరిగేవి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కే చిన్న సినిమాలు బలమైన కంటెంట్‌తో ఇతర భాషల వాళ్లను సైతం ఆశ్చర్యపరిచేవి. ప్రేమిస్తే సహా ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. అదే సమయంలో స్టార్ హీరోలు నటించే కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్తదనం ఉండేది. జెంటిల్‌మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, రమణ, గజిని లాంటి సినిమాలను ఈ కోవలో చెప్పుకోవచ్చు. తమిళంలో ఇంత గొప్ప సినిమాలు రావడానికి అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. వాళ్లు రొటీన్ సినిమాలను తిరస్కరించేవాళ్లు.
కొత్త సినిమాలను నెత్తిన పెట్టుకునేవాళ్లు. దీంతో తమిళ ఫిలిం మేకర్స్‌తో పాటు ప్రేక్షకులకు సైతం ప్రశంసలు దక్కేవి. ఇలాంటి అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఉండబట్టే.. అక్కడ అంత మంచి సినిమాలు వస్తున్నాయన్న అభిప్రాయం కలిగేది. కానీ గత దశాబ్ద కాలంలో మొత్తం కథ మారిపోయింది. తమిళ సినిమాల క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అద్భుతాలను ఆవిష్కరించిన శంకర్, మురుగదాస్ సహా సీనియర్ డైరెక్టర్లందరూ చతికిలపడ్డారు. యువ దర్శకుల్లో మెరుపులు మెరిపిస్తున్న వాళ్లు తక్కువ. ఇక స్టార్ హీరోలు చేసే సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విజయ్, అజిత్ లాంటి స్టార్ల సినిమాల్లో రవ్వంతైనా కొత్తదనం ఉండట్లేదు.
ఒకప్పుడు మన స్టార్ హీరోలు చేసిన రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తుండగా.. వాటినే తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. తెరి, మెర్శల్, బిగిల్, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం.. ఇలా విజయ్ గత కొన్నేళ్లలో చేసిన సినిమాలన్నీ పరమ రొటీన్. అయినా అవన్నీ బాగా ఆడాయి. ఇక అజిత్ కూడా అంతే. వలిమై, తునివు, విడాముయర్చి.. సినిమాలు చాలా సాధారణంగా ఉంటాయి. ఇప్పుడు అజిత్ నుంచి వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సైతం రొటీన్ కంటెంట్‌తో తెరకెక్కింది. ఇందులో హీరో ఎలివేషన్లు తప్ప ఏమీ లేవు. కానీ దీన్నే బ్లాక్ బస్టర్ అంటూ ఊగిపోతున్నారు తమిళ ప్రేక్షకులు. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలకు పట్టం కట్టి.. గొప్ప అభిరుచిని చాటి దేశంలోనే బెస్ట్ ఆడియన్స్ అనిపించుకున్న వాళ్లు ఇప్పుడు ఇలాంటి రొటీన్ మసాలా సినిమాలకు సంతృప్తి చెందుతుండడం విడ్డూరం.