తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation) నియంత్రణలోనూ తమకు సాటి రాగల రాష్ట్రాలు దేశంలోనే లేవని నిరూపించాయి. దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం నమోదు అయిన రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లేపాయని చెప్పాలి. అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పగా… దానిని అనుసరించిన ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. వెరసి దేశంలోనే అత్యల్ప వస్తు, సేవల ధరలు కలిగిన రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు నవ చరిత్రను లిఖించాయి. శుక్రవారం దేశంలోని తాజా ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా… రెండు తెలుగు రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచి సత్తా చాటాయి. తాజా గణాంకాల్లో దేశ ద్రవ్యోల్బణం 3.61 శాతం నమోదు కాగా… తెలంగాణలో కేవలం 1.31 శాతమే నమోదు అయ్యింది. ఇక ఏపీలో 2.44 శాతం ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో ఏపీ కంటే కాస్తంత తక్కువగా 2.27 శాతం ద్రవ్యోల్బణం నమోదు అయ్యింది. అత్యధిక ద్రవ్యోల్బణం కేరళలో 7.31గా నమోదు అయ్యింది.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అపఖ్యాతి మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా అవతరించడం గమనార్హం. ఈ పరిణామం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం. 2023 డిసెంబర్ దాకా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా…అదే నెలలో ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలో 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల దాకా రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం వంటి పథకాలతో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆసక్తికర ప్రకటన చేశారు. అత్యధిక ద్రవ్యోల్బణం నుంచి అత్యల్ప ద్రవ్యోల్బణం దాకా తెలంగాణ ప్రయాణం అంటూ ఆయన చేసిన పోస్టు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే… రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్, ఆపై రాజధాని లేని కారణంగా అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఆపై వైసీపీ ఐదేళ్ల పాలనలో విపరీతమైన అప్పుల కారణంగా ఏపీ అప్పుల ఊరబిలో కూరుకుపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కారు… కేవలం పది నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమూలంగా మార్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల దాకా పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం, వాటిలో రిలయన్స్ వంటి సంస్థలు తమ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రారంభించడంతో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి జోరందుకుంది. అంతేకాకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెన్షన్లను రూ.4 వేలకు పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్ వంటి పథకాలను ఇప్పటికే ప్రారంభించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేసింది. ఫలితంగా అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రెండో రాష్ట్రంగా ఏపీ అవతరించింది.