సజ్జల రామకృష్ణారెడ్డి… అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది. వైసీపీ అధికారంలో ఉండగా… సకల శాఖల మంత్రిగా పిలిపించుకున్న సజ్జల… వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు గా పని చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితం కాగా… ఆ పార్టీ వ్యవహారాలను నడుపుతూ బిజీబిజీగానే సాగుతున్నారు. పార్టీలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాతి స్థానం ఇప్పుడు సజ్జలదేనని చెప్పాలి. ఎందుకంటే… పార్టీకి అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతుండగా.. రాష్ట్ర సమన్వయకర్తగానే కాకుండా ఇప్పుడు కొత్తగా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ పదవిని కూడా ఆయన దక్కించుకున్నారు.
వైసీపీలో పార్టీ అధ్యక్ష పదవి తర్వాత అత్యున్నత స్థాయిలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఇలా అధికారిక హోదాలు ఉన్నాయి. అయితే ప్రాంతీయ సమన్వయకర్తలు ఆయా ప్రాంతాల వ్యవహారాలకు మాత్రమే పరిమితం. ఇక ప్రధాన కార్యదర్శుల సంఖ్య చాలానే ఉంటుంది కాబట్టి… ఆ పదవులను అద్యక్ష పదవి తర్వాతి పోస్టులుగా కూడా పరిగణిచలేం. ఇక ఉన్నదల్లా రాష్ట్ర సమన్వయకర్త హోదానే అద్యక్ష పదవి తర్వాత స్థానంగా పరిగణిస్తున్నారు. అంటే పార్టీలోని అన్ని హోదాల్లో ఉన్న నేతలతో పాటుగా చివరాఖరుకు ప్రాంతీయ సమన్వయకర్తలపైనా అధ్యక్షుడితో పాటు రాష్ట్ర సమన్వయకర్తకే అజమాయిషీ ఉంటుందని చెప్పాలి.
తాజాగా పార్టీలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిర్ణాయక విభాగంగా పార్టీ రాజకీయ అడ్వైజరీ కమిటీ (పీఏసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రీజనల్ కో ఆర్డినేటర్లను శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొన్న వైసీపీ అదిష్ఠానం.. అందులో సభ్యులు గా 33 మందిని ప్రకటించింది. వీరిలో పార్టీకి చెందిన కీలక నేతలంతా దాదాపుగా ఉన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వారి పేర్లు మాత్రం కనిపించలేదు. అయితే పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలందరినీ ఇందులో అకామిడేట్ చేసినట్టుగా చెప్పాలి. ఈ కమిటీకి కన్వీనర్ గా సజ్జల వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వైసీపీ తెలిపింది. వెరసి జగన్ తర్వాత వైసీపీలో ఇకపై మొత్తం వ్యవహారాలన్నింటినీ సజ్జలనే పర్యవేక్షిస్తారని చెప్పక తప్పదు.