అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా… కూటమి సర్కారు తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో త్వరలోనే కోలుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గత వారం ఆక్వా రంగానికి సరికొత్త జవసత్వాలు నింపేలా ఓ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన పలు సూచనల్లో కీలకంగా భావిస్తున్న పలు అంశాలు అమలు దిశగా సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైన రొయ్యల ఫీడ్ ధరలు తగ్గాయి. ఈ తగ్గింపు కూడా ఏదో నామ్ కే వాస్తేగా కాకుండా కిలో ఫీడ్ ధరను ఒకే సారి రూ.4 మేర తగ్గిస్తూ ఫీడ్ ఉత్పత్తిదారులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయం శనివారమే అమలులోకి తీసుకువచ్చారు. ఈ పరిణామం అక్వా రైతులకు భారీ ఉపశమనాన్ని ఇవ్వనుందని చెప్పక తప్పదు.
ఏపీలో ఆక్వా రంగం ఓ రేంజిలో వృద్ధి సాధిస్తోంది. అదే సమయంలో రొయ్యల వినియోగం స్ధానికంగా కంటే విదేశాల్లో అధికంగా ఉంటోంది. ప్రత్యేకించి అమెరికాకు మన ఆక్వా ఉత్పత్తులు భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. అమెరికాలో ఎలాంటి పరిణామం చోటుచేసుకున్నా కూడా అది వెనువెంటనే మన ఆక్వా రంగంపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇటీవలే అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్… అమెరికా దిగుమతులపై సుంకాలను భారీగా పెంచారు. ఫలితంగా ఇతర దేశాలు, ఇతర ఉత్పత్తుల పరిస్థితి ఎలా ఉన్నా… ఏపీ ఆక్వాపై ఆ ప్రభావం వెనువెంటనే పడిపోయింది. అమెరికా ప్రభావం కారణంగా రొయ్యల కొనుగోలును వ్యాపారులు దాదాపుగా నిలిపివేశారు. స్థానిక అవసరాలకు సరిపడ రొయ్యలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందులోనే రేట్లు భారీగా తగ్గించి మరీ ఇస్తున్నారు. దీనిపై రొయ్యల రైతులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.
ఈ పరిస్థితిపై వేగంగా స్పందించిన చంద్రబాబు… గత వారం ఆక్వా రంగంపై ఓ కీలక సమీక్షను నిర్వహించారు. ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులతో పాటు మత్స్య శాఖ అధికారులు పాలుపంచుకున్న ఈ భేటీలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా పలు సూచనలు చేశారు. ధరలను మరీ దిగజారిపోకుండా కొనుగోళ్లు చేయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. అదే సమయంలో ఫీడ్ ధరలను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో చంద్రబాబు సూచించిన పలు అంశాలపై ఆయా రంగాలకు చెందిన సంఘాలు దృష్టి సారించాయి. అందులో భాగంగా రొయ్యల ఫీడ్ ఉత్పత్తిదారుల సంఘానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు… తమ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై… రైతులను ఆదుకునే దిశగా ఫీడ్ ధరలను తగ్గిద్దామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సంఘం ఓకే చెప్పగా… కిలో ఫీడ్ ధరను రూ.4లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమలు చేయాలని కూడా సంఘం తీర్మానించగా… శనివారం నుంచే ఫీడ్ ధరల తగ్గింపు అమలులోకి వచ్చేసింది.