అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మునిసిపాలిటీ పాలకవర్గాన్ని ఆ పార్టీ చేజిక్కించుకుంది. ఈ మేరకు శనివారం నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కందుల దుర్గేశ్ ఏమంత శ్రమ పడకుండానే…పాలకవర్గం వైసీపీ నుంచి జనసేనకు అలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏపీలో అధికార పగ్గాలు వైసీపీ నుంచి కూటమికి మారిపోయిన తర్వాత స్థానిక సంస్థలు కూడా ఒక్కటొక్కటిగానే కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బేరసారాలూ జరుగుతున్నాయి. అధికార పార్టీ బలవంతంగా తమ ప్రజా ప్రతినిధులను లాగేసుకుంటోందని, ఈ క్రమంలో దారుణాలకూ పాల్పడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. అయితే నిడదవోలులో అలాంటి ఆరోపణలు వినిపించకపోవడం గమనార్హం. అంతా సైలెంట్ గా జరిగిపోయింది.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మునిసిపాలిటీని వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 28 కౌన్సిలర్లు ఉండగా… 27 స్థానాలను గెలిచింది. ఒక్క స్థానాన్ని టీడీపీ గెలిచింది. ఇటీవలే కూటమి అధికారంలోకి రావడం, నిడదవోలు ఎమ్మెల్యేగా కందుల దుర్గేశ్ గెలవడంతో వైసీపీ శిబిరంలోని 10 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. మిత్రపక్షం టీడీపీకి ఉన్న ఒక సభ్యుడితో కలుపుకుని జనసేన బలం 12కు చేరగా… మరో ముగ్గురు సభ్యులు వైసీపీని వీడితే జనసేన ఖాతాలో నిడదవోలు మునిసిపాలిటీ పడిపోయినట్టే.
ఇలాంటి సందర్భంలో ఇటీవలే మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వీరి కోరిక మేరకు అధికారులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుండగానే.. తాజాగా వైసీపీకి చెందిన మరికొందరు కౌన్సిలర్లు దుర్గేశ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ఫలితంగా జనసేన మెజారిటీ కౌన్సిలర్లు కలిగిన పార్టీగా అవతరించింది. అంతకుముందే మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేనలో చేరిపోగా… తాజాగా ఆయననే చైర్మన్ గా కొనసాగించేలా దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు.