రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం రాజకీయం ఎలా ఉంది? ఎటు వెళ్తోంది? ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా ఎనిమిది జిల్లాల్లో బలంగా ఉన్న కాపులకు రాజకీయ వేదిక ఏదైనా ఉందా? వారిని నడిపించే నాయకుడు కనిపిస్తున్నాడా? అంటే.. ప్రశ్నలు తప్ప సమాధానం కనిపించడం లేదు. తమకు సరైన నాయకుడు, సరైన రాజకీయ వేదిక ఏదీ లేకుండా పోయిందనే ఆవేదన కాపు సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు తాము నమ్మిన ఏ ఒక్కరూ కూడా స్వయంగా కాపులకు మేలు చేయాలన్న ధోరణిని అవలంభించక పోవడంతో ఈ వర్గం తమకు సరైన నాయకుడు లేరనే భావనతో ఉండడం గమనార్హం. ఇక, ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా.. వారిని నమ్ముతుండడం తాము చేస్తున్న తప్పుగా వారు భావిస్తున్నారు.
2007లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఏకమయ్యారు. సామాజిక న్యాయం నినాదాన్ని వారునమ్మారు. కానీ, అనంతర కాలంలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో కాపులకు దిమ్మతిరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల్లోకి సర్దుకున్నారు. అయినా.. వారికి సరైన వేదిక మాత్రం లభించలేదు. దీంతో మళ్లీ కాపులు వెతుకులాట ప్రారంభించారు. రెడ్డి సామాజిక వర్గానికి పార్టీ ఉంది. కమ్మ వర్గాలకు టీడీపీ ఉంది. కానీ, తమకు లేదనే వేదన కొనసాగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ దూసుకురావడం వారిలో ఒకింత ఆశావాదాన్ని రేకెత్తించింది. కానీ, వీరి ఆశలు అడియాసలే అయ్యాయి. తనకు కులం లేదని.. ఒక గట్టి సంకల్పంతో వచ్చానని ఆయన ప్రకటించుకోవడంతో గత ఎన్నికల్లో కాపులు ఎటు నిలవాలో తెలియని పరిస్థితి ఏర్పడి.. ఎవరికివారు తమకు నచ్చిన మార్గం ఎంచుకున్నారు.
ఇక, ఇప్పుడు మరోసారి.. తమకు ప్రత్యేక రాజకీయ వేదిక విషయం చర్చకు వచ్చింది. ప్రస్తుతం కాపుల తరఫున తూర్పుగోదావరికి చెందిన సోము వీర్రాజు బీజేపీలో చక్రం తిప్పుతున్నారు. ఆదిలో ఎలా ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో కాపులను సంఘటిత పరిచేలా సోము దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ తర్వాత.. కాపుల విషయంలో సోము సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ ఈయనను నమ్మే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు కాపుసామాజిక వర్గంలోని సీనియర్లు. బీజేపీ జాతీయ పార్టీ కావడం, ఆ పార్టీ ప్రయోజనాలు వేరేగా ఉండడంతో సోమును నమ్మి.. ఆ పార్టీ వెంట నడవడం ఏమేరకు సమంజసమనేది కాపుల వాదనగా వినిపిస్తోంది.
పోనీ.. కాపులకు అండగా ఉంటూ వచ్చిన ముద్రగడ పద్మనాభంను నమ్ముకుందామనే ఆలోచన కొందరు చేస్తున్నా.. మెజారిటీ కాపులు మాత్రం ఈ విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముద్రగడను నమ్ముకుని.. కాపులు ఆయన వెంటనడిచారు. కాపుల రిజర్వేషన్ సాధిద్దామంటే.. సరే అన్నారు. ఉద్యమాలు సాగించారు. ముద్రగడ ఏం చెప్పినా.. అది చేశారు. కానీ, ముద్రగడ దానిని సాధించలేక పోయారు. పోనీ.. ఉద్యమమైనా కొనసాగించారా? అంటే.. అది కూడా లేదు. పైగా కాపు ఉద్యమం నుంచి నేరుగా ఆయన తప్పుకొన్నారు. ఈ పరిణామాలతో.. మెజారిటీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ముద్రగడపై విశ్వాసం కోల్పోయారు.
ఈ నేపథ్యంలో కాపులకు ఒక రాజకీయ నాయకుడుతోపాటు వేదిక కూడా అవసరమనే భావన వ్యక్తమవుతోంది. కానీ, ఈ గ్యాప్‌ను ఫిల్ చేసేవారే కనిపించడం లేదు. ఒకప్పుడు వంగవీటి మోహన రంగా.. కాపుల కోసం నిలబడ్డారు. ఎన్ని నిర్బంధాలు.. అవరోధాలు ఎదురైనా.. కాపుల నాయకుడిగా ఆయన ఎంతో కొంత సాధించారు. ఆ తర్వాత రంగా రేంజ్‌లో ఎవరూ కాపులకు కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రాధా ఉన్నా.. తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో రాధా కనుక పుంజుకుంటే.. కాపులు ఆయన వెంట నిలిచేందుకు రెడీగా ఉన్నారనే సంకేతాలు వస్తుండడం గమనార్హం. మరి ఈ దిశగా రాధా అడుగులు వేస్తారా? లేదా? చూడాలి!!
This post was last modified on January 23, 2021 5:13 pm
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…