వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పులివెందుల నియోజకవర్గంలోని బకారాపురంలో హల్చల్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బకారాపురంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన ఆయన తమపార్టీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి అనుమతించాలని కోరారు. అయితే.. నిబంధనల మేరకు అనుమతించామనిఅధికారులు ఆయనకు సమాధానం ఇచ్చారు. దీనిని తిప్పికొట్టిన జగన్.. అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
సుమారు 70 మంది వైసీపీ ఏజెంట్లతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన జగన్ ను తొలుత పోలీసులు అనుమతించలేదు. దీంతో వాదనకు దిగిన ఆయనను.. ఎట్టకేలకు కార్యాలయంలోకి పోలీసులు అనుమతించారు. అధికారులతో జగన్ చర్చలు జరిపారు. తమ వారిని అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అయితే.. అలాంటి దేమీ లేదని అధికారులు బదులిచ్చారు. ఆ వెంటనే బయటకు వచ్చిన జగన్ తనవారితో రోడ్డుపై బైఠాయించి ఎన్ని కలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ రోడ్డుపై బైఠాయించడంతో ముందస్తుగానే అలెర్ట్ అయిన పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అలానే.. ముఖ్య నాయకులను కూడా అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. ఈ పరణామాలపై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరగడం లేదని.. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థుల ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించిన తర్వాతే పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదా రద్దు చేయాలని అన్నారు.
పులివెందులలో పోలింగ్..
వైసీపీ సహా జగన్ హడావుడిని పక్కన పెడితే.. పులివెందులలో ఓటర్లు భారీగా తరలి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికే 45 శాతానికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు ప్రకటించారు. అలానే కడప జిల్లా పరిధిలోని రాజంపేటలో 35 శాతం, కడపలో 25 శాతం, బద్వేల్లో 45 శాతం, మైదుకూరులో 36 శాతం, జమ్మలమడుగులో 80 శాతం, ఎర్రగుంట్లలో 35 శాతం మేరకు ఓటింగ్ జరిగినట్టు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates