ఏపీ మండలాధ్యక్ష ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం.. కనబరిచింది. 2024లో వచ్చిన స్ట్రయిక్ రేట్‌ను ఇప్పుడు కూడా కొనసాగించింది. ఏపీలోని మొత్తం 625 మండలాలకు ఎన్నికలు జరగ్గా.. 533 స్థానాల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. జనసేనకు 42, బీజేపీకి 7 మండలాధ్యక్ష పదవులు దక్కాయి. వైసీపీకి 39 మండలాధ్యక్ష స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం. మండలాధ్యక్ష ఎన్నికల్లో కూటమి పార్టీలకు అధిక సంఖ్యలో పదవులు దక్కడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 625 మండలాలకు ఎన్నికలు నిర్వహించగా, టీడీపీ 533 మండలాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. మొత్తంగా కూటమి మరోసారి 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించడం విశేషం.
మండల ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనబడడం గమనార్హం. రాష్ట్రంలోని 600 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించగా, టీడీపీ 445 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 83, వైసీపీ 40, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించాయి. సీపీఎంకు 3, స్వతంత్రులకు 9 ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. గత ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించగా.. ఇప్పుడు కూటమి ఒకరకంగా పోరాడి గెలిచిందనే చెప్పాలి. మొత్తంగా మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాలను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో కూటమికి 58.90% ఓట్లు రాగా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి 33.56% ఓట్లు లభించాయి. దీంతో ప్రభుత్వ పనితీరుపై తీర్పు ప్రభావం కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుకు నిదర్శనమని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే.. స్థానిక ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో కూటమి పార్టీల మధ్య నెలకొన్న విభేదాలతో కొంత మేరకు ఓటు బ్యాంకు తగ్గిందన్న అభిప్రాయం ఉంది. అదే మరింత ఐక్యతగా ఉండి ఉంటే.. ఓటు బ్యాంకు మరింత పెరిగి ఉండేదన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా.. కీలకమైన ఎన్నికల పర్వం దాదాపు ముగిసింది. ఇక, పంచాయతీ ఎన్నికల పోరే మిగిలింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates