పరిటాల కలను నెరవేర్చిన కుమారుడు శ్రీరామ్

శ్రీస‌త్య‌సాయి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా.. శ‌నివారం  సీనియ‌ర్ నాయ‌కుడు, దివంగ‌త ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరాం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న తండ్రి(ర‌వి) పాదాల సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం.. జ‌రిగిన స‌మావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే, ర‌వి స‌తీమ‌ణి ప‌రిటాల సునీత మాట్లాడుతూ.. ఉద్వేగానికి గురై.. క‌న్నీరు పెట్టుకున్నారు. “ఏ జ‌డ్పీ పీఠం ద‌క్కించుకోవాల‌ని మా వారు క‌లలు క‌న్నారో.. దానిని మా వార‌సుడు శ్రీరాం సాధించారు.“ అని తెలిపారు.

నాడు పరిటాల రవి…  బి.కె.పార్థసారథిని, చమన్ ను జడ్పీ చైర్మన్లుగా చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఏ జడ్పీ చైర్మన్ పదవి కోసం అయితే పరిటాల రవి ప్రాణాలు పోగొట్టుకున్నారో, నేడు జిల్లా నేతలందరి సహకారంతో అదే చైర్మన్ పీఠంపై త‌మ‌ కుమారుడు శ్రీరామ్ కూర్చోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏ లోకాన ఉన్నా రవి ఎంతో సంతోషిస్తారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిటాల అభిమానులు, టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ఇది పండగ రోజు అని అభిప్రాయ‌ప‌డ్డారు.

శ్రీస‌త్య‌సాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారి జిల్లా ప్రజా పరిషత్ ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో చైర్మన్ పీఠాన్ని పరిటాల శ్రీరామ్ ద‌క్కించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి చెందిన గోరంట్ల జడ్పీటీసీ సునేత్ర వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వందలాది వాహనాలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య పుట్టపర్తికి చేరుకుని రెవెన్యూ భవన్‌లో జడ్పీ చైర్మన్‌గా ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు. యువతకు పెద్దపీట వేస్తూ, కొత్త ఆలోచనలతో జిల్లాను అభివృద్ధి చేస్తాన‌ని శ్రీరామ్ చెప్పారు.

తొలి జడ్పీ చైర్మన్‌గా ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన చంద్ర‌బాబు, లోకేష్ , ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. గతంలో జిల్లాకు, పార్టీకి ఏ కష్టం వచ్చినా పరిటాల కుటుంబం ముందుండి అండగా నిలబడిందని.. పరిటాల రవి పార్టీని, సామాన్యులను నిలబెట్టడానికి కృషి చేశారన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీకి చైర్మన్, జనసేనకు వైస్ చైర్మన్ పదవులు కేటాయించార‌ని,  జిల్లాలో ఫైటర్ జెట్ పరిశ్రమ, కియా సెకండ్ ఎక్స్‌పాన్షన్ ప్లాంట్, సాగునీటి ప్రాజెక్టులతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అభివృద్ధే వజ్రాయుధం అని.. పేర్కొన్నారు.