ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు జరుగుతున్న ఈ సమరంలో క్లైమాక్స్ రసవత్తరంగా మారింది. ఎటు చూసినా ఒక్కడే కనిపిస్తున్నాడు.. ఆయనే కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ! ప్రస్తుతం బెజవాడ వీధుల్లో ఎక్కడ విన్నా ఆయన పేరే మార్మోగుతోంది.
బెజవాడ ప్రజలకు, వంగవీటి కుటుంబానికి మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదు, దశాబ్దాల భావోద్వేగ అనుబంధం. ఈ సెంటిమెంట్‌తో పాటు దివంగత రంగా అభిమానుల అండదండలు రాధా వెనుక కొండలా నిలిచాయి. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు సైతం ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఒకే తాటిపైకి వచ్చి ప్రచారం చేస్తుండటంతో.. రాధా విజయం లాంఛనప్రాయంగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేల సమన్వయం ఆయన దూకుడును మరింత పెంచింది.
ఖాళీ అయిన మైదానం.. వైసీపీ సైలెంట్
మరోవైపు, గతంలో నగరంలో గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేసింది. రాధా లాంటి మాస్ లీడర్‌ను ఎదుర్కొనే దమ్ములేక ఆ పార్టీ పెద్దలు ముందుగానే వెనకడుగు వేశారు. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్య నేతలంతా ప్రచారానికి ముఖం చాటేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రచారంలో జోరు లేక, గత పాలనపై వ్యతిరేకత చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారనుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యూహం క్షేత్రస్థాయిలో వర్కౌట్ కావడం లేదు. అవినీతి రహిత పాలనంటూ ఆయన నినాదం ఇచ్చినా, ఆ ప్రచారమంతా యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా లైవ్‌లు, మేధావుల మీటింగ్లకే పరిమితమైంది. బస్తీల్లో ఉండే సామాన్య ఓటర్లను, కార్మికులను ఆకట్టుకునే మాస్ కనెక్ట్ లేకపోవడంతో ఆయన ప్రభావం నామమాత్రంగానే మిగిలిపోయింది.
మొత్తానికి, విపక్షాల నిస్తేజం, ప్రత్యర్థుల ఉనికి ప్రశ్నార్థకం కావడం, కూటమి బలంతో బెజవాడ మేయర్ పీఠంపై వంగవీటి రాధా విజయబావుటా ఎగరవేయడం ఖాయమని ప్రస్తుత రాజకీయ సమీకరణాలు స్పష్టంచేస్తున్నాయి. అమరావతి రాజధాని నగరంలో ఈ విజయం కూటమి ఆధిపత్యాన్ని మరింత బలపరచనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates