లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని కొన్ని స్థానాల్లో అసలు పోటీ లేని పరిస్థితి కూడా నెలకొంది. కొన్ని కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే వైసిపి ఇలా అంచనా వేస్తున్నటువంటి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అలివి కాని పరిస్థితిలు నెలకొన్నాయి. ఉదాహరణకు కుప్పం, మంగళగిరి, పిఠాపురం, భీమవరం, గాజువాక, నరసాపురం, ఉండి, పాలకొల్లు, విజయవాడ ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి తీవ్రమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇక్కడ నాయకులు ఉన్నప్పటికీ వారి పట్ల ప్రజల్లో సానుకూలమైనటువంటి దృక్పథం లేకపోవడం వ్యతిరేకత భారీగా పుంజుకోవడం వంటివి కనిపిస్తున్నాయి.

దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, ఏవైనా వైసీపీ దక్కించుకోవాలని ప్రయత్నం చేయటం వరకు తప్పులేదు. కానీ అంత ఈజీ అయితే కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అయితే పూర్తిస్థాయిలో టిడిపి బలోపేతం అయిపోయింది. మంగళగిరిలో అసలు వైసీపీ మాట వినిపించడం లేదు. పిఠాపురం సంగతి అందరికీ తెలిసిందే. ఇలా అనేక నియోజకవర్గాల్లో వైసిపి పరిస్థితి తీవ్ర ఎదురుగాలులు వీచేలా ఉంది.

ఈ నేపథ్యంలో అలివికాని పరిస్థితిలో నాయకులు తల్లడిల్లుతున్నారు. కానీ, ఇక్కడ చిత్రం ఏంటంటే అక్కడ కూడా జగన్ ఆయా నాయకులకు టార్గెట్ పెట్టడం వచ్చే ఎన్నికల్లో టికెట్లకు స్థానిక సంస్థల్లో విజయానికి ముడి పెట్టడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. దీంతో వారు ఏం చేయాలనే విషయంపై తలలు పట్టుకుంటున్నారు. ప్ర‌స్తు తం వైసీపీ నేత‌లు.. వ్యూహాలపై వ్యూహాలు వేయాల‌ని చూస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి అనుకూలంగా లేదు.

పిఠాపురంలో నాయ‌కులు లేరు. కుప్పంలో కార్య‌క‌ర్త‌లు క‌రువ‌య్యారు. మంగ‌ళ‌గిరిలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఇలా.. నాయ‌కులు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ద‌శ-దిశ కొర‌వ‌డింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా వైసీపీ ఆయా ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి మార్పులు చేర్పుల దిశ‌గా అడుగులు వేయాల‌ని నాయ‌కులు కోరుతున్నారు. మ‌రోవైపు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చేతులు ఎత్తేస్తే ఎమ్మెల్యే టికెట్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా వారిలో క‌నిపిస్తోంది.