ఈ ఏడాది రెండు కీలక ఘట్టాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పలు కేసులు నమోదై.. విచారణ దశలో ఉన్న వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ ప్రశ్న పత్రం లీకైన ఘటన ఈ ఏడాది మే-జూన్ మధ్య తీవ్రస్థాయిలో అలజడి రేపింది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. యువత పెద్ద ఎత్తున కదిలింది. అప్పుడే ఆవిర్భవిస్తున్న దశలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని అందిపుచ్చుకుంది. ఫలితంగా యువత కదంతొక్కారు. దీంతో అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. కట్ చేస్తే.. ఇకపై ఇలాంటి నిరసనలు జరగనివ్వబోమని.. చెప్పిన కేంద్రానికి ఇప్పుడు ఎన్నికల సంఘం వివాదం మరింత కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
ప్రధానంగా మూడు అంశాలు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, దీనికి కారణాలను గమనిస్తే.. 3 అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 1) కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి: సర్ పేరుతో 2002 నాటి ఎన్నికల ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేస్తున్నామనిచె బుతూ.. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను హక్కుకు దూరం చేశారన్న వాదన వినిపిస్తోంది. దీనిలో ప్రధానంగా ప్రతిపక్షాలే బాధితులుగా ఉండడం గమనార్హం. దీంతో సర్ ప్రక్రియపై ఆది నుంచి కూడా విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. గతంలో రాహుల్‌గాంధీ.. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలలో జరిగిన సర్ ప్రక్రియను ఉదహరిస్తూ.. లోపాలను బయట పెట్టారు. అయితే.. వాటిపై పారదర్శకంగా విచారణ చేయలేదు. దీంతో ఆ వివాదాలు ఇప్పుడు మరింత రాజుకున్నాయి.
- ఫాం-6: ఇది కొత్తగా ఓటర్లకు హక్కు కల్పించే పత్రం. అయితే.. దీనిలో కొన్ని నిబంధనలను, కాలమ్స్‌ను మార్చేశారన్నది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. తద్వారా.. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకునేవారు.. 2002 నాటి ఓటర్ల జాబితాలో తమ తాతలు, తండ్రుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, సుదీర్ఘ జాప్యం కారణంగా.. ఆయా వివరాలు ప్రజల వద్దలేకుండా పోయాయి. అంటే.. ఇప్పటికే 13 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు కోల్పోగా.. ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు పొందే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారన్న విమర్శలు పుంజుకున్నాయి. దీంతో ఇటీవల ఈ నిబంధనను తొలగించినా.. అసలు ఈ కొత్త నిబంధనను ఎవరు చేర్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
- ఏకపక్ష నిర్ణయాలు: కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటారు. అయితే.. వీరిలో సఖ్యత లేదని, ప్రధాన ఎన్నికల కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా మారిపోయారన్నది కాంగ్రెస్ పార్టీ సహా.. ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలు. ఈ నేపథ్యంలోనే వారు ఉద్యమించారు. జ్ఞానేష్ కుమార్ కారణంగా ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నారు. దీనిపై జ్ఞానేష్ మౌనంగా ఉండగా.. కేంద్రం కూడా ఇదే బాటలో ఉంది.
రెండు చీలికలు….
జ్ఞానేష్ రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనలు రెండుగా చీలిపోయాయి. పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్‌ను సమర్థిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయనను సమర్థించే వారి సంఖ్య 42గా ఉండగా.. ఇప్పుడది 143కు చేరింది. ఇక, జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా యువత సహా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులు ఉద్యమించారు. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయవాద సంఘాలు కూడా ఇప్పుడు జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. దేశంలో ఈ ఏడాది ఉవ్వెత్తున సాగిన ఉద్యమాల్లో ఇది రెండోదిగా నిలుస్తోంది. ఇది మరింత పుంజుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీంతో జ్ఞానేష్ రాజీనామా చేయకతప్పక పోవచ్చన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates