ఇంత మంది స్పందిస్తున్నారంటే… కేటీఆర్ సీఎం అయినట్టేనా

ఆలసించిన మంచి తరుణం మిస్ అవును..తొందరపడదాం.. యువనేత మనసులో రిజిస్టర్ అవుదామన్న ఆత్రుత గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కానున్నట్లుగా కొద్దికాలంగా వార్తలు వస్తున్నా.. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ఇప్పటికే సీఎం లేనప్పుడు ఆ పనులన్ని కేటీఆరే చేస్తున్నారన్న లోగుట్టును మొహమాటపడకుండా బయటకు చెప్పేయటం.. కొడుక్కి పగ్గాలు అప్పజెప్పేందుకు కేసీఆర్ సైతం సిద్ధంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయితే ఏంటి? అన్న మాటతో పాటు.. ఆయనకు తమ మద్దతు ఉందన్న విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తున్నారు.

ఇలాంటి విషయాల్లో అందరి కంటే స్పీడ్ గా ఉండే మంత్రి తలసాని కాస్త లేట్ గా స్పందించారు. అయితే మాత్రం.. లేట్ గా వచ్చినా లేటెస్టుగా అన్న చందంగా ఆయన రియాక్టు అయ్యారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని సమర్థింపు సందేహాన్ని సంధించారు. ఈ విషయం మీద తగిన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ తరహా వ్యాఖ్యల్ని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నోటి నుంచి వచ్చింది. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత డెవలప్ అవుతుందన్న ఆయన.. ఈ విషయంలో పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. మరి.. ఇప్పుడు అంతలా డెవలప్ కావటం లేదన్న సందేహం వస్తే.. మొదటికే మోసం వస్తుందన్న జంకు లేకుండా సీఎంగా కేటీఆర్ అయితే తప్పేంటన్న మాట మాట్లాడటం బాజిరెడ్డికే చెల్లింది. ఇక.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మరో అడుగు ముందుకేసి సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలన్నదే తన ఆకాంక్ష అంటూ మిగిలిన వారికి మించిన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఈ తరహా దూకుడు గులాబీ నేతల్లో మరింత ఎక్కువ కావటం ఖాయమంటున్నారు.