రాజకీయాల్లోకి అరంగేట్రం చేయకముందే, పార్టీ పెట్టకముందే అన్నాతై రజనీకాంత్ కాడి దింపేసిన విషయం అందరికీ తెలిసిందే. కొందరు పిరికివాడన్నారు, మరికొందరు రజనీ తత్వం ఇంతే అని సరిపెట్టుకున్నారు. అయితే తమిళనాడులో జరిగిన ఓ సర్వే నివేదిక చూసిన తర్వాత రజనీకాంత్ చాలా తెలివైనవాడనే విషయం అర్ధమవుతోంది. వచ్చే మే నెలలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్ధితి ఏమిటనే విషయమై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది.
బహుశా ఏబీపీ-సీ ఓటర్ సర్వే రిపోర్టు పై రజనీకి ముందే సమాచారం ఉందేమో. అందుకనే ముందే కాడిని దింపేశాడనే అనుకోవాలి. ఇంతకీ సర్వే నివేదికలోని కీలకం ఏమిటయ్యా అంటే డీఎంకే+కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతోందట. 41.1 శాతం ఓట్లతో 162 సీట్లు గెలుచుకుంటుందని సర్వే స్పష్టంగా చెప్పేసింది. మరి ప్రస్తుత అధికార ఏఐఏడీఎంకే పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే 28.7 శాతం ఓట్లతో 98 సీట్లకు పరిమితమైపోతుందట. నిజానికి 98 సీట్లు రావటం అంటే కూడా చాలా చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే జయలిలత తెచ్చిపెట్టిన అధికారాన్ని నిలుపుకోవటమే పన్నీర్ శెల్వం, పళనిస్వామికి చాలా ఎక్కువ.
మరి చిన్నమ్మగా పిలిపించుకునే శశికళ పార్టీ అమ్మ మక్కళ్ మున్నెట్ర కజగం(ఏఎంఎంకె)పార్టీ ప్రభావం కూడా పెద్దగా ఉండదని తేలిపోయింది. అలాగే కమలహాసన్ పార్టీతో పాటు ఇతర చిన్నా చితక పార్టీల పరిస్దితి గురించి అనుకునే పనేలేదు. మరింతజేసి బీజేపీ పరిస్దితి ఏమిటి ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. తమిళనాడు రాజకీయాల్లో ఏదో చేసేద్దామని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఏ ప్రయత్నం కూడా వర్కవుటైనట్లు లేదు. అందుకనే సర్వేలో జనాలు అసలు బీజేపీని పట్టించుకోవటం లేదని అర్ధమైపోయింది.
మరి ఇన్ని కాంబినేషన్ల మధ్య రజనీకాంత్ పార్టీ పెట్టుంటే ఏమయ్యుండేది ? ఏమీ కాదు కమలహాసన్ పార్టీలాగానో లేకపోతే చిన్నమ్మ పార్టీ అదీకాకపోతే బీజేపీ పరిస్ధితే ఎదురయ్యేదనటంలో సందేహమే లేదు. ఎందుకంటే రజనీ మీద తమిళజనాలకు రాజకీయంగా పెద్దగా మోజేమీలేదు. ఏదో ఊడబొడిచేస్తాడనే నమ్మకం అంతకన్నా లేదు. మరి కొద్దినెలల్లో ఎన్నికలుందనగా, తీవ్ర అనారోగ్యంతో, కరోనా వైరస్ కాలంలో పార్టీ పెట్టేస్తానని రజనీ ప్రకటించినా జనాలు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని రజనీ బాగా స్టడీ చేసినట్లున్నాడు. అందుకనే ఎవరేమనుకున్నా పర్వాలేదని కాడిదింపేశారు. మొత్తానికి రజనీ తెలివైన నిర్ణయమే తీసుకున్నట్లున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates