క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను ఇలాగే వదిలేస్తే అధికార వైసీపీకి మొదటికే మోసం రావటం ఖాయమనే అనుమానంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే దేవాలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాలను తెగనరికిన ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. దీనిపై కొద్దిరోజులుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ+బీజేపీ+జనసేనలు ఎంతగా గోల చేస్తున్నదీ అందరు చూస్తున్నదే. ఇటువంటి నేపధ్యంలోనే డీజీజీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం పెట్టి దాడులకు పాల్పడ్డవారిలో కొందరిని గుర్తించినట్లు చెప్పటం సంచలనంగా మారింది.
డీజీపీ చెప్పిన ప్రకారం టీడీపీ, బీజేపీలకు చెందిన కొందరిని గుర్తించారు. వారిలో కొందరిని అరెస్టు చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు. అయితే మంత్రులు, వైసీపీ నేతలు చివరకు జగన్మోహన్ రెడ్డి సొంతమీడియా సాక్షి కూడా మొత్తం టార్గెట్ ను టీడీపీ మీద మాత్రమే ఫోకస్ చేసింది. దేవాలయాలపై దాడులు, విగ్రహామూర్తుల ద్వంసం ఘటనల్లో రెండు ప్రతిపక్షాల్లోని కొందరు నేతల పాత్రుందని డీజీపీ చెబితే మరి అధికారపార్టీ మాత్రం టీడీపీ మీద మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టి బీజేపీని వదిలేసినట్లు ?
నిజానికి తెలుగుదేశంపార్టీ ఎంత ప్రమదకారో బీజేపీ అంతకన్నా ప్రమాదకరమైన పార్టీ. గ్రామ గ్రామాన బలమైన క్యాడర్ బలమున్న తెలుగుదేశంపార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అంత ఘోరంగా ఓడిపోవటానికి అనేక కారణాలున్నాయి. రాజకీయంగా శూన్యత ఉందని చెబుతు ఆ గ్యాప్ ను ఫిల్ చేయటానికి బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. ఇపుడు బీజేపీని కూడా టీడీపీతో సమానంగా చూడకపోతే భవిష్యత్తులో జగన్ కు కమలంపార్టీతో ఇబ్బందులు తప్పదనే అనుమానంగా ఉంది.
కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్రాల్లో చొచ్చుకుపోయేందుకు తెగ ప్రయత్నిస్తొంది. పొరుగునున్న తెలంగాణాలో పుంజుకునేందుకు బీజేపీ ఎన్ని అలజడులు సృష్టిస్తొందో అందరు చూస్తున్నదే. దానికి కారణం ఏమిటంటే కేంద్రం నుండి ఆ పార్టీ నేతలకు అందుతున్న మద్దతే. అదే పద్దతిలో ఏపిలో కూడా పుంజుకునేందుకు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు సోము వీర్రాజు అండ్ కో. కాబట్టి టీడీపీ తో పాటు బీజేపీని కూడా సమానంగా చూడకుండా వదిలేస్తే బీజేపీనే రేపు జగన్ కు ఏకుమేకై కూర్చోవటం ఖాయమనే అనిపిస్తోంది. అప్పుడు మొదటికే మోసం వచ్చినా అనుమానం లేదు.