రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. త్వరలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పైచేయి సాధించేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఎప్పటిలాగే లోకల్ ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీకి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించారు. వైసీపీ మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తోంది. మిగిలిన పక్షాలు పోటీకి దిగినా అది నామమాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది.
అయితే కూటమి పార్టీల మధ్య సయోధ్య వున్నప్పటికి స్థానిక ఎన్నికల విషయంలో ఒక తాటి మీదకు రాలేకపోతున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందని నాయకులు గట్టిగా చెప్పలేక పోతున్నారు. ఒకవైపు కూటమి మధ్య పొరపచ్చలు రాకుండానే మరోవైపు ఎవరికి వారు సొంత ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనలో జరుగుతున్న పరిణామాలు కొంత వేడిని రగిలిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రాజకీయ విశ్లేషకులకు చేతినిండా పని పెట్టింది.
జనసేన కార్యకర్తల అంచనాలకు తగినట్లుగానే సీట్ల కేటాయింపు ఉంటుందని భరోసా ఇచ్చిన పవన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినట్లు ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎక్కడైనా బలం వున్న చోట అవసరమైతే కూటమి నేతలతో ఫ్రెండ్లీగా పోటీ చేద్దామని తేల్చి చెప్పేశారు. ఇదిప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కూటమి పార్టీల మధ్య కొన్ని చోట్ల పోటీ వుండే అవకాశం ఉంటుందని తేలిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
గత ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది. ఈ రెండేళ్లలో పార్టీ బలం పెరిగిందని జనసేన నాయకులు, కార్యకర్తలు వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం అదే ఆలోచనతో వున్నారు. దాంతో బలం వున్న చోట్లలో పోటీ చేయడం ద్వారా పార్టీని మరింతగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా వుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కేడర్ వుంది. లీడర్లు వున్నారు. అన్నీ వర్గాల ప్రజల్లో ఓటింగ్ వుంది. జనసేనకు ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కేడర్ లేదు. లీడర్షిప్ లేదు. పవన్ కళ్యాణ్ కు అభిమానులు మాత్రం వున్నారు. ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కేవలం అభిమానులతో సాధ్యమవుతుందా అంటే లేదనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితిలో టీడీపీ,జనసేన విడివిడిగా పోటీ చేస్తే అసలుకు మోసం జరగవచ్చు. కూటమి పార్టీల మధ్య మూడో పక్షమైన వైసీపీ లబ్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. వైసీపీకి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదని భావిస్తోంది. ఈ పరిస్థితిలో గత ఎన్నికలకు కాస్త అటు ఇటుగా సీట్ల పంపకం జరిగితే బాగుంటుందని భావిస్తోంది.
లోకల్ ఎన్నికల్లో జనసేన కు 20 శాతం సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనకు బలం వున్న ప్రాంతాల్లో 40 శాతం సీట్లు, ఇతరా చోట్లలో 20 శాతం సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు వినికిడి. ముఖ్యంగా ఉత్తరాంద్ర, గోదావరి జిల్లాల్లో అధిక శాతం సీట్లలో పోటీ చేయాలని జనసేన కోరుకుంటుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అత్యధిక సీట్లు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విశాఖ, విజయవాడతో పాటుగా మొత్తం 6 మేయర్ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కూటమి మధ్య సీట్ల పంపకం ఎలా వున్నా ఫ్రెండ్లీ పోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates