ఇదేం పాట.. త్రివిక్రమ్‌పై తీవ్ర విమర్శలు

మూడు వారాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల సినిమా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఒక పాటను లేపేయడం అప్పుడు చర్చనీయాంశం అయింది. రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో విడుదల చేసిన స్పైసీ సాంగ్ ‘మాల’ థియేటర్లలో కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ చేసిన నివేథా పెతురాజ్‌తో వెంకీ ఆడి పాడిన రొమాంటిక్ సాంగ్ ఇది. మరి నిడివి పెరగడం వల్ల ఈ పాటను కట్ చేశారా.. ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఆ సాంగ్ మిస్సయిందని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే ‘ఆదర్శ కుటుంబం’ థియేట్రికల్ రన్ ఆల్రెడీ ముగిసిపోయిన నేపథ్యంలో నిన్న ‘మాల’ ఫుల్ వీడియో సాంగ్‌ను యూబ్యూట్‌లోకి వదిలింది చిత్ర బృందం.

ఐతే ఈ పాట ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు తీవ్ర విమర్శలే తెచ్చిపెడుతోంది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకీతో ఇంత స్పైసీ సాంగ్ చేయించడం ఏంటి అంటూ ఆయన మీద మండిపడుతున్నారు నెటిజన్లు. వెంకీ కెరీర్లో ఇంతకుమించిన రొమాంటిక్ సాంగ్స్ చాలానే చేశాడు. కానీ ఇప్పుడు ఆయన వయసును దృష్టిలో ఉంచుకోకుండా నివేథా పెతురాజ్ లాంటి యంగ్ హీరోయిన్‌తో ఇంత ఘాటు రొమాన్స్ చేయించడమేంటి.. ఇద్దరి మధస్య ‘‘కిటికీ.. మూసేస్తా’’.. ‘‘లైటు.. ఆర్పేస్తా’’ లాంటి లిరిక్స్ పెట్టడమేంటి అంటూ త్రివిక్రమ్ మీద ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు.

సినిమాలో విషయం లేకపోతేనే ఇలాంటి పాటల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని.. ఇది త్రివిక్రమ్ స్థాయికి ఏమాత్రం తగని పాట అని విమర్శిస్తున్నారు. ఈ పాటను థియేట్రికల్ వెర్షన్ నుంచి కట్ చేసి మంచి పని చేశారని, లేదంటే వెంకీని అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇబ్బందిపడేవారని అంటున్నారు. కానీ ఇంకో వర్గం మాత్రం ఈ పాటను బిగ్ స్క్రీన్ మీద చూసి ఉంటే మంచి కిక్కు ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది.