క‌లెక్ట‌ర్‌ తోనే పెట్టుకున్న ఎమ్మెల్యే… తమిళనాట రచ్చ రచ్చ!

“నువ్వు కొంచెం గ్లామ‌ర్‌గా ఉండాలి. పంజాబీ డ్ర‌స్.. నీకు బాగుంటుంది. చీర‌ల సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు.“- ఇది ఏదో కామాంధుడు సాధార‌ణ మ‌హిళ‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు కావు. బాధ్య‌తాయుత ప్ర‌జాప్ర‌తినిధిగా మ‌హిళ‌ల గౌర‌వానికి, వారి భ‌ద్ర‌త‌కు పూచీ వ‌హించాల్సిన ఓ ఎమ్మెల్యే.. ఏకంగా జిల్లా క‌లెక్ట‌ర్‌కు పంపించిన వాట్సాప్ సందేశాలు!. ఇక్క‌డితో కూడా ఆగ‌కుండా.. చాలా దూర‌మే వెళ్లాడ‌ని ఆ మ‌హిళా క‌లెక్ట‌ర్ క‌న్నీరు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని తీవ్ర‌స్థాయిలో కుదిపేస్తోంది. ప‌త్రికా భాష‌కు అంద‌ని రీతిలో స‌ద‌రు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు కూడా తీవ్రంగానే స్పందించింది.

అంతేకాదు.. “అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబ‌ట్టి.. మీరు ఆయ‌న‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? “ అని ప్ర‌శ్నించిన మ‌ద్రాస్ హైకోర్టు.. విచార‌ణ కోసం ప్ర‌భుత్వం నియ‌మించిన అధికారిని త‌క్ష‌ణ‌మే త‌ప్పించాల‌ని.. ఐజీ, డీఐజీ స్తాయి అధికారితో విచార‌ణ చేయించాల‌ని నివేదిక‌ను నేరుగా కోర్టుకే స‌మ‌ర్పించాల‌ని ఆదేశించ‌డం ఈ కేసు తీవ్ర‌త‌ను.. ఆ మ‌హిళా క‌లెక్ట‌ర్ పై ఏ రేంజ్‌లో ఎమ్మెల్యే దాడికి పాల్ప‌డ్డాడో స్ప‌ష్టం చేస్తున్నాయి. మ‌రోవైపు.. విజ‌య్ నేతృత్వంలోని ప్ర‌భుత్వంపై విప‌క్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. “మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఎలానూ లేదు.. క‌నీసం మీ అధికారుల‌కైనా భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని స్థితిలో ఉన్నారా“ అంటూ మాజీ సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు.

ఏం జ‌రిగింది?
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా మహిళా కలెక్టర్‌ను ఇదే జిల్లాలోని అధికార టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని ఆమె ఫిర్యాదు చేశారు. నిజానికి గ‌త వారం రోజులుగా ఈ వ్య‌వ‌హారం సాగుతున్నా.. స‌ర్కారు పెద్ద‌లు దీనిని రాజీ చేసే ప్ర‌య‌త్నం చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. చిత్రం ఏంటంటే.. రాజీ ప్ర‌య‌త్నాలు సాగుతున్న క్ర‌మంలోనే.. విఘ్నేష్‌.. ఆమెకుమ‌రో సందేశం పంపించి.. “మాకుగెస్ట్ హౌస్ ఉంది. ఎవ‌రూ లేరు. చుట్టూ పూల తోట‌లు.. సువాస‌న భ‌రిత వాతావ‌రణం నెల‌కొంది.“ అని పేర్కొన‌డంతో ఈ వివాదం ర‌చ్చ‌కెక్కింది.

అసభ్యకర వాట్సాప్ సందేశాలు పంపడం, వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయడం, ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై కలెక్టర్ ఈ నెల 23(ఆదివారం)న పోలీసులకు ఫిర్యాదు చేయగా, కళ్లకురిచ్చి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వెంట‌నే ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. అధికారిని నియ‌మించింది. అయితే.. ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది.  విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చర్యల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ఎస్పీ కంటే సీనియర్ అధికారితో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని, సోషల్ మీడియాలోని అసభ్యకర పోస్టులను తొలగించాలని, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబ‌ట్టి.. చాలా సున్నితంగా తీసుకుని, ఆయ‌న‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అని నిల‌దీసింది.