శ్రీమతి మీద రీమేక్ ఒత్తిడి ఉంటుందేమో

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటారు. అదే విధంగా ఏ టైంలో జరగాల్సిన రీమేక్ ఆ టైంలో తీసేయాలి. లేదంటే ఒక్కోసారి ఆశించిన ఫలితాలు దక్కవు. చిరంజీవి గాడ్ ఫాదర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన శ్రీమతి వచ్చే వారం ఓటిటిలో విడుదల కానుంది. తిరువీర్ ఆమె సరసన భర్తగా నటించాడు. హనుమాన్ నిర్మాతల బ్యానర్ కావడంతో కంటెంట్ పరంగా క్వాలిటీ కనిపిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు మ్యాటర్ కొద్దాం.

2021 కరోనా టైం డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన మలయాళ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్. విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు ప్రేక్షకుల ఆదరణ భారీగా దక్కించుకుంది. వ్యూస్ కూడా మిలియన్లలో వచ్చాయి. తర్వాత తమిళం హిందీలో రీమేక్ చేశారు కానీ అవి ఒరిజినల్ వెర్షన్ ని మ్యాచ్ చేయలేకపోయాయి. తిరిగి ఇంత గ్యాప్ తర్వాత అంటే అయిదు సంవత్సరాల తర్వాత అదే గ్రేట్ ఇండియన్ కిచెన్ ని శ్రీమతిగా తెలుగులో తీశారు. మార్కెటింగ్ అంతా నివేదా థామస్ పేరు మీదే చేస్తున్నారు.

ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే అప్పట్లో అంత మంది చూసిన కంటెంట్ ని ఇప్పుడు మళ్ళీ వేరే ఆర్టిస్టులతో తీస్తే చూస్తారాని. కథ చాలా బాగుంటుంది. డాన్స్ కళని ప్రాణంగా ప్రేమించే ఒక స్త్రీ పెళ్ళై అత్తారింటికి వచ్చాక తన అభిరుచిని చంపుకుని వాళ్లకు సేవలు చేస్తూ వంటింటికి పరిమితం కావాల్సి వస్తుంది. ఒకదశ వరకు ఓపికగా భరించిన ఆమె చివరికి తన టాలెంట్ ని పణంగా పెట్టలేక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. అదేంటనేది తెరమీద చూస్తేనే కిక్.

ట్రైలర్ లోనే ముఖ్య కథనంతా విడమరిచి చూపించారు. థియేటర్ రిలీజ్ అయితే రిస్క్ ఎక్కువగా ఉండేది కానీ ఓటిటి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయింది. కాకపోతే ఎంత రీచ్ వస్తుందనేది చూడాలి. రేణు దేశాయ్, గోపరాజు రమణ లాంటి ఆర్టిస్టులతో క్యాస్టింగ్ అయితే కలర్ ఫుల్ గానే ఉంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించగా ఈఎల్ విశ్వనాథ్ సంగీతం సమకూర్చారు. మరి ఈ శ్రీమతి బుల్లితెర జనాలను ఏ మేరకు మెప్పిస్తుందో ఇంకో వారం ఆగితే క్లారిటీ వస్తుంది. నివేదా ఇమేజ్ ప్లస్ అయ్యేలా ఉంది.