తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. కవిత ఇప్పటి వరకు స్థానిక సమస్యలను ప్రస్తావించారు. రాజకీయంగా దూకుడు పెంచారు. ఇక, తాజాగా హైదరాబాద్ సహా ఖమ్మం వంటి కీలక జిల్లాల్లో ఉన్న ఏపీకి చెందిన కుటుంబాలను కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో సెటిలర్ల ఓటు అత్యంత కీలకం. దీనిని తనవైపు తిప్పుకొనే పార్టీలు నగరంలో ప్రభావం చూపిస్తున్నాయి.
తాజాగా కవిత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేవలం తెలంగాణ హక్కులు…. ఇక్కడి ప్రజల మేలు కోసమే తన పార్టీ పనిచేస్తుందని.. అవసరమైతే.. ఎంత వరకు అయినా వెళ్తామని ప్రకటించిన కవిత.. తాజాగా తన టంగ్ మార్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని.. రెండు రాష్ట్రాల ప్రజల స్నేహంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన వన సమారాధనకు వచ్చిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుకుంటున్నామన్నారు.
ఇదే సమయంలో కీలకమైన కృష్ణానది జలాలపైనా కవిత సానుకూలంగా మాట్లాడారు. ఏపీలో ఈ నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారన్న `భావన`ను తెలంగాణలో కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే.. అనుమతులు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నప్పుడు.. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు చేశారు. తద్వారా.. ఏపీలో అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు తీసుకున్నా.. తమకు అభ్యంతరం లేదన్న వాదనను వినిపించారు.
ఇరు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం ఒక ఒప్పందం ప్రకారం జరగాల్సి ఉందని కవిత చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి పనులు జరిగేందుకు తమ సహకారం ఉంటుందన్నారు. సెటిలర్ల విషయంలో ఇప్పటికీ కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. తాము అలా చేయబోమని, సెటిలర్లు కూడా.. తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. వారు అక్కడ పన్నులు కడుతున్నారని గుర్తు చేశారు. నీటి పంపకాల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విన్నవించారు. ఇలా.. సెటిలర్ల విషయంలో కవిత చేసిన వ్యాఖ్యల వెనుక ఆమె వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates