ఈసారి బాక్సాఫీస్ పోటీ చాలా విచిత్రంగా జరుగుతోంది. శుక్రవారం విడుదలైన వాటిలో ఈ నగరానికి ఏమైంది రిపీట్ కు యూత్ నుంచి మంచి మద్దతు దక్కింది. టాక్ మిక్స్డ్ గా ఉన్నా ఓమ్ కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. విపరీతమైన ప్రశంసలకు నోచుకున్న ఆకాశంలో ఒక తార మాత్రం బ్యాటింగ్ నెమ్మదిగా మొదలుపెట్టింది. ఆదివారం దాకా ఇంచుమించు ఇదే సీన్ కనిపించింది. అయితే గంటల వ్యవధిలో పరిణామాలు మారడం షురూ అయ్యింది. దుల్కర్ కు అనుకూలంగా ట్రెండ్ మారిపోయింది.
సోమవారం పరీక్షని ట్రేడ్ వర్గాలు చాలా నిశితంగా పరిశీలిస్తాయి. ఒక సినిమా నిజమైన సత్తా బయట పడేది ఈ రోజేనని వాళ్ళ నమ్మకం. ఆ లెక్కన చూసుకుంటే ఆకాశంలో ఒక తార డామినేషన్ ప్రేక్షకుల తీర్పు ఎటువైపు ఉందో తేటతెల్లం చేస్తోంది. బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే ఈ నగరానికి ఏమైంది రిపీట్ గంటకు సగటు మూడు వేల టికెట్లు అమ్ముతుండగా, ఆకాశంలో ఒక తార ఏడు వేలకు దగ్గరగా ఉంది. మూడు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ గా ఉన్న ఓమ్ తొమ్మిది వేల దగ్గర ఉన్నప్పటికీ దాని బిజినెస్ కోణంలో ఇది చిన్నదే.
ఈ లెక్కన రేపటి నుంచి కూడా ఆకాశంలో ఒక తార హోల్డ్ బలంగా ఉండటం ఖాయం. పబ్లిక్ టాక్ మెల్లగా జనంలోకి వెళ్తోంది. ఎలాంటి అసభ్యత లేని క్లీన్ కంటెంట్ కావడంతో ఫ్యామిలీస్ వెళ్తున్న వైనం థియేటర్ల దగ్గర సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇది ఎంత పెద్ద స్థాయికి వెళ్తుందనేది ఇంకో సండే అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది. యుఎస్ ప్రమోషన్స్ కోసం విదేశాలకు వెళ్లిన దుల్కర్, సాత్వికలు ఇండియా తిరిగి రాగానే ఇక్కడ మరో విడత పబ్లిసిటీ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.
మంచి కంటెంట్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని తెలుగు ఆడియన్స్ మరోసారి ఋజువు చేశారు. కాకపోతే కమర్షియల్ గా ఇలాంటివి మహానటి స్థాయిలో ఆడితే మరికొందరు ఫిలిం మేకర్స్ కి స్ఫూర్తి వస్తుంది. పవన్ సాధినేని దర్శకత్వంలో గీత ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ ఫిక్షనల్ బయోపిక్ పుణ్యమాని సాత్విక వీరవల్లి పరిశ్రమలో హాట్ టాపిక్ అయిపోయింది. పలు అగ్ర నిర్మాణ సంస్థలు ఆల్రెడీ ఆఫర్లు ఇవ్వగా రామ్ చరణ్ 17 కోసం తన పేరు సీరియస్ పరిశీలనలో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates