ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి చంద్రబాబు నేతృత్వంలో 2024 జూన్ 13 వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో ఈ సమావేశాలకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత గైర్హాజరవుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 14 వరకు 57 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగినట్లు ఆర్టీఐకు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆగస్టు తర్వాత కూడా వరసగా సమావేశాలు నిర్వహిస్తూనే వున్నారు. కేబినెట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాన్ని మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా చెబుతుంటారు. అందుకే ఈ మీటింగ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
కారణమేదైనా కావచ్చు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచుగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. లేదా మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం తొమ్మిది సమావేశాలకు ఆయన ఆబ్సెంట్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జూన్ 4 వ తేదీన జరిగిన సమావేశానికి ఆయన హాజరైనప్పటికీ వెన్ను నొప్పి తీవ్రం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయారు.
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీసీఎం పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా కనిపించారు. ప్రకృతి చికిత్స కోసం కేరళం వెళ్లి 20 రోజులు వుండి వచ్చిన ఆయన ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం.
ఒకవైపు స్థానిక ఎన్నికలలో సీట్ల పంపకాలగురించి సీరియస్ గా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్లోజ్ గా మూవ్ కావడం విపక్షాలతో పాటుగా స్వపక్షంలోని నాయకులు, కార్యకర్తలకు ఓ సంకేతం పంపించినట్లుగా వుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates