విజయనగరం జిల్లా రాజకీయాలు మొత్తం బొత్సా కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి. ప్రధానంగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో వారం రోజుల్లోనే బొత్సా మేనల్లుడు పోయి బొత్సా కూతురు వచ్చారు. జిల్లా రాజకీయాలలో బొత్సాకు కుడి భుజంగా వ్యవహరించిన మజ్జి శ్రీను ఇటీవలే టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం తెలిసిందే. దాంతో భీమిలి నియోజకవర్గ ఇంచార్జిగా బొత్సా కూతురు అనూష పేరు ప్రకటించారు వైసీపీ అధినేత జగన్.
నిజానికి అనూషను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పోటీ చేయించాలని బొత్సా భావించారు. అదే విషయాన్ని ప్రకటించారు కూడా. అయితే కూతురి కోసం బొత్సా జనసేనలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. కొంతకాలం ఆయన దాన్ని ఖండించలేదు కూడా. దాంతో రేపో మాపో ఆయన పవన్ కళ్యాణ్ పక్కన చేరిపోవడం ఖాయమని చెప్పుకున్నారు. ఈలోపే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను కూతురు శిరీషాతో కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
బొత్సా కు మజ్జి శ్రీనుకు మధ్య విజయనగరం జిల్లా పరిషత్ సీటు చిచ్చు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మజ్జి తన కూతురితో కలిసి పసుపు కండువా కప్పు కోవడం దీనికి నిదర్శనంగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రేపటి జిల్లా పరిషత్ సీటు శిరీషాకు ఖాయమైనట్లు టీడీపీ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది.
దీంతో అనివార్యంగా అనూషను జిల్లా పరిషత్ బరి నుంచి తప్పించినట్లు అర్ధమవుతుంది. దానికి బదులుగా భీమిలి అసెంబ్లీ ఇంచార్జిగా తెరమీదకు వచ్చారు. దీంతో ఇప్పుడు భీమిలి రాజకీయం బొత్సా వర్సస్ మజ్జి పోరాటంగా మారాయి. అయితే నిన్నటి వరకు మజ్జిని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలని బొత్సా అనూష పిలుపునివ్వడం గమనార్హం. ఒకరు పార్టీని వీడితే కార్యకర్తలకు ఇద్దరు అందుబాటులోకి వచ్చారని, నేటి నుంచి నేను, తమ్ముడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటివరకు బొత్సా 1.0 చూశారని, ఇకనుంచి బొత్సా 2.0 చూస్తారని సవాల్ విసరడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అనూష మజ్జిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates