తెలంగాణ‌లో జంపింగుల ప‌ర్వం కొత్తగా వచ్చింది కాదు

తెలంగాణలో రాజ‌కీయాల్లో 2014 నుంచి కూడా జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. నేడు కొత్త‌గా వ‌చ్చింది కాదు.. భ‌విష్య‌త్తుల్లో పోయేదీ కాదని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆదిలో ఈ జంపింగుల‌ను ప్రోత్స‌హించింది.. సాక్షాత్తూ.. బీఆర్ఎస్ పార్టీనే కావ‌డం గ‌మ‌నార్హం. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ 63 సీట్ల‌ను ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది. అయితే.. త‌మ‌కు ఎప్ప‌టికైనా ఇబ్బందేన‌ని భావించిన బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో బుజ్జ‌గింపు రాజ‌కీయాలు చేసింది.

అదేస‌మ‌యంలో అప్ప‌ట్లో వైసీపీ కూడా తెలంగాణ‌లోని ప‌లుస్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో వారిని కూడా త‌న చెంత‌కు చేర్చుకున్న బీఆర్ఎస్‌.. ఆదిలో .. జంపింగుల‌కు శ్రీకారం చుట్టింది. అనంత‌ర కాలంలో టీడీపీ నుంచి కూడా ప‌లువురు నేత‌ల‌ను లాగేసింది. ఈ క్ర‌మంలో కొంద‌రికి కీల‌క ప‌ద‌వులు కూడా క‌ట్టబెట్టింది. ఇలా మొద‌లైన జంపింగుల ప‌ర్వం.. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మ‌రింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన‌.. స‌బితా ఇంద్రారెడ్డి.. సునీతా ల‌క్ష్మారెడ్డి వంటివారు.. ఏకంగా లెజిస్లేచ‌ర్ పార్టీని స్పీక‌ర్ స‌మ‌క్షంలోనే బీఆర్ఎస్‌లో విలీనం చేసేశారు.

సో.. మొత్తంగా.. తెలంగాణ‌లో నాయ‌కుల జంపింగుల ప‌ర్వం.. అనేది బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలోనే ప్రారంభ‌మైంది. దీనికి క‌ర్త‌, క‌ర్మ క్రియ కూడా.. ఆ పార్టీనే అనేది విశ్లేష‌కుల మాట‌. ఇక‌, ఆ త‌ర్వాత‌.. కాలంలో 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. జంపింగుల‌ను నేరుగా ప్రోత్స‌హించ‌లేదు. అయితే.. కొంద‌రు స‌హ‌జంగానే ప‌ద‌వులు ఆశించో.. లేక కేసుల భ‌యంతోనో పార్టీలు మారారు. దీనిని కూడా అధికారికంగా ఎక్క‌డా చేప‌ట్ట‌లేదు. కానీ.. బీఆర్ ఎస్ పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి.. చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు వెంటాడుతోంది.

నాడు కాంగ్రెస్ ఉదాశీన‌త‌!

నాడు తమ పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్‌లో చేరిన‌ప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా ప‌ట్టు బిగించక పోవ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా సబితా ఇంద్రారెడ్డి వంటివారు పార్టీని వీలినం చేస్తున్నట్టు ప్ర‌క‌టించినా.. కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. నాయ‌కులు కూడా అప్ప‌టి బీఆర్ఎస్ బ‌లంగా ఉండ‌డంతో దానిని ఎదిరించి పోరాడేందుకు వెనుకాడిన ప‌రిస్థితి ఉంది. ఇది బీఆర్ఎస్‌కు క‌లిసి వ‌చ్చింది.

మున్ముందు ప‌రిస్థితి ఏంటి?

జంపింగుల వ్య‌వ‌హారం.. అనేది ఒక్క తెలంగాణ‌లోనే జ‌ర‌గ‌డం లేదు. కేంద్రం స్థాయిలో బీజేపీ కూడా.. ప‌లు పార్టీల‌ను చీల్చి.. వారి నాయ‌కుల‌ను త‌మ చెంత‌కు తెచ్చుకునే ప‌నిని ముమ్మ‌రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర‌, పంజాబ్ స‌హా.. అనేక ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈ జంపింగుల ప‌ర్వం క‌నిపిస్తోంది. చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ.. అధికారంలో ఉన్న పార్టీల‌ను చూసుకుని నాయ‌కులు జంప్ చేస్తున్నారు. సో.. దానం నాగేంద‌ర్ ఉదంతం ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నా.. భ‌విష్య‌త్తులో జంపింగులు ఉండ‌వు.. అని నిర్దారించే ప‌రిస్థితి అయితే లేదు.