ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో టైర్-2 సిటీస్‌లో ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లేకపోవడం పట్ల ఎప్పట్నుంచో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసినా.. అది సాధ్యపడలేదు.
ఐతే ఎట్టకేలకు ఈ సిటీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రాబోతోంది. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దీని పట్ల వరంగల్ సహా పొరుగు జిల్లాల వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ వాసే అయిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్టు కూడా పెట్టాడు సందీప్. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ.. ఈ విమానాశ్రయానికి సందీప్ పేర్లు కూడా సూచించడం విశేషం.
తన సొంత పట్టణంలో ఎయిర్ పోర్టు వస్తోందని తెలిసిందని, ఈ ఎట్టకేలకు ఈ కల నిజం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని సందీప్ పేర్కొన్నాడు. ఈ ఎయిర్ పోర్టుకు రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్ఐఏ) లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (కేఐఏ) అని పేరు పెట్టాలని.. ఈ పేర్లలో ఏదో ఒకటి ఉంటే వరంగల్ స్ఫూర్తికి, ఈ ప్రాంత వైభవానికి ప్రతీకలుగా ఉంటాయని సందీప్ అన్నాడు.
వరంగల్‌లో ఇప్పటికే ఎయిర్‌పోర్టు ఉన్నప్పటికీ.. అది నామమాత్రమే. అది చాలా చిన్నది. అక్కడ ఏ కార్యకలాపాలు లేవు. ఐతే ఇప్పుడు కేంద్రం అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదనంగా భూసేకరణ చేపట్టింది. అది ఒక కొలిక్కి వచ్చినట్లే. ఇంకొన్ని రోజుల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. వచ్చే ఏడాది పనులు కూడా మొదలు కావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates