లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించే స‌మ‌యానికి అంటే.. మ‌రో ఏడాదిలోపు.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం ఖాయ‌మేనా ? .. పాద‌యాత్ర చేపట్టినా ఈ కేసు కార‌ణంగా.. ఆయ‌న కోర్టుకు, స్టేష‌న్ల‌కు తిర‌గాల్సి ఉంటుందా? .. అలా అయితే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? ఇవీ.. ఇప్పుడు ఏపీ జ‌నాల్లోనూ.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జ‌రుగుతున్న చ‌ర్చ‌లు. దీనికి కార‌ణం.. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ అధినేత జగన్ పాత్ర.. ఉంద‌న్న అనుమానాల‌ను బ‌ల‌ప‌రిచే సాక్ష్యం వెలుగు చూడ‌డ‌మే!.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ బిజినెస్‌ను ప్ర‌భుత్వ‌మే త‌న చేతుల్లోకి తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న లైసెన్సీల‌ను ర‌ద్దు చేసి.. ప్ర‌భుత్వమే వ్యాపారం చేసింది. అయితే.. ఈ క్ర‌మంలో మ‌ద్యం త‌యారీ కంపెనీల నుంచి.. భారీ ఎత్తున ముడుపులు స్వీక‌రించార‌ని, అదేస‌మ‌యంలో లిక్క‌ర్ త‌యారీ విష‌యంలో త‌మ అనుకూల నాయ‌కుల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఈ క్ర‌మంలోనూ భారీ ఎత్తున నిధులు స‌మీక‌రించార‌ని.. త‌మ‌కు ముడుపులు ఇచ్చిన వారికే అనుమ‌తులు ఇచ్చార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ క్ర‌మంలో కేసు న‌మోదైన త‌ర్వాత‌.. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్‌బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీని విచార‌ణ గ‌త ఏడాదిన్న‌ర‌గా కొన‌సాగుతోంది. మ‌ద్యం కేసులో నిధులు చేతులు మార‌డ‌మే కాదు.. ఖండాంత‌రాలు కూడా మారాయ‌ని అధికారులు భావిస్తున్నారు. మ‌నీ లాండ‌రింగ్ ద్వారా.. ఇత‌ర దేశాల‌కు నిధులు చేర‌వేశార‌ని ఈడీ అధికారులు సైతం గుర్తించారు. ఈ క్ర‌మంలోనే అనేక మందిని విచారించారు.

తాజాగా.. మాజీ సీఎం జ‌గ‌న్‌కు ఆప‌రేష‌న్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీగా వ్య‌వ‌హ‌రించిన స‌త్య ప్ర‌సాద్‌ను సిట్ అధికారులు విచారించారు. దీంతో అస‌లు ఈ లిక్క‌ర్ కేసు వ్య‌వ‌హారంలో ఏం జ‌రిగింద‌న్న‌ది ఆయ‌న పూస గుచ్చిన‌ట్టు వివ‌రిం చారు. నేరుగా ఆయ‌న వాంగ్మూలాన్ని.. ఏసీబీ కోర్టు నమోదు చేయ‌డం ఇక్క‌డ విశేషం. సీసాల‌నుంచి మూత‌ల వ‌ర‌కు.. మ‌ద్యం త‌యారీ నుంచి ర‌వాణా వ‌ర‌కు.. కంపెనీల నుంచి వ్య‌క్తుల వ‌ర‌కు.. ఏ ద‌శ‌లో ఎంతెంత సొమ్ము చేతులు మారిందో స‌త్య‌ప్ర‌సాద్ వివ‌రించారు.

అంతేకాదు.. అప్ప‌టి సీఎం జగన్ ఇంట్లోనే లిక్కర్ కుంభకోణం స్కెచ్ వేశారని స‌త్య ప్ర‌సాద్ వివ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, జగన్ కు మద్యం ముడుపులు రూ.3,200 కోట్లు అందాయని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారుతానని పేర్కొంటూ.. సత్యప్రసాద్ పిటిషన్ కూడా దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అరెస్టు.. విచార‌ణ.. వంటి అంశాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. మ‌రి ఇది జ‌రుగుతుందా? లేక‌.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ను అరెస్టు చేస్తే.. వైసీపీకి సింప‌తీ వ‌స్తుంద‌ని కూట‌మి వెన‌క్కి త‌గ్గుతుందా? అనేది చూడాలి.