ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల రెండో వారంలో ఆయన ప్రకృతి, ఆయుర్వేద చికిత్సల కోసం.. కేరళం రాష్ట్రానికి వెళ్లారు. అక్కడే ఉండి.. చికిత్స తీసుకున్నారు. కుడి భుజానికి ఆపరేషన్ తర్వాత.. వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్ ఆయుర్వేద చికిత్స నిమిత్తం కేరళం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 2న పుట్టిన రోజును కూడా ఆయన అక్కడే సింపుల్‌గా నిర్వహించుకున్నారు. అదేవిధంగా పార్టీ పరంగా యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే ఆయన సందేశం ఇచ్చారు.
ఇక, కేరళంలోనే పలు ఆలయాలను కూడా దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో వైద్యుల సలహా మేరకు.. పవన్ కల్యాణ్ తిరిగి విధుల్లోకి చేరేందుకురెడీ అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన కేరళం నుంచి హైదరాబాద్, అక్కడ నుంచి విజయవాడకు చేరుకున్నారు. నేరుగా మంగళగిరిలోని జనసేనపార్టీ కార్యాలయానికి వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పవన్ కల్యాణ్ విధుల్లోకి వస్తారని పార్టీ కీలక నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా వ్యూహ రచన, అమలు వంటివాటిపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి అభినందనలు..
పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విదులకు హాజరయ్యేందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.
ఇక, పార్టీలో అంతర్గత వ్యవహారాలపై ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక ఎన్నికల్లో టికెట్లు, నేతల ఎంపిక వంటి విషయాలను సోమవారం నుంచి జిల్లాల వారీగా పవన్ కల్యాణ్ పర్యవేక్షించనున్నట్టు ఆయన వివరించారు. ఈ విషయంలో ఎవరూ బహిరంగ చర్చలకు దిగవద్దని.. ఏదైనా ఉంటే పార్టీ కార్యాలయానికి చేరవేయాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates