టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకు న్నారు. పైకి ఈ విష‌యం చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న ఏర్పాట్లు.. నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తు న్న అభివృద్ధి, రాజ‌కీయం వంటివి గ‌మ‌నిస్తే.. టార్గెట్ గ‌జ్వేల్ అనే వ్యూహంతోనే సీఎం రేవంత్ రెడ్డి ముం దుకు సాగుతున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

గజ్వేల్‌లో ప్రస్తుతం రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడి నుంచి గెలిచినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం గజ్వేల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు క‌నిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేదంటూ.. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. నాయకుల‌ను ఇంటింటికీ పంపించి కేసీఆర్‌కు ప్ర‌జ‌ల‌పై ఏమాత్రం అభిమానం లేద‌ని.. వారి స‌మ‌స్య‌లు కూడా ఆయ‌న‌కు ప‌ట్ట‌వ‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

“సమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవికి గౌరవంగా రాజీనామా చేసి, గజ్వేల్‌లో ఉపఎన్నికకు సిద్ధం కావాలి” అని రేవంత్ ఇటీవ‌ల‌ సవాల్ విసిరిన విష‌యం తెలిసిందే. దీంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సైతం.. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. మ‌రోవైపు.. కేసీఆర్‌పై అవినీతి ముద్ర వేసేందుకు కూడా రాజ‌కీయంగా వ్యూహాత్మ‌క అడుగులు పడుతున్నాయి. ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ భూముల‌పై సీఎం రేవంత్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించ‌డం వెనుక ఇదే రీజ‌న‌ని అంటున్నారు.

క్యాంప్ ఆఫీస్ వివాదాలు

2 నెలల క్రితం గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను కాంగ్రెస్ నాయకులు ముట్టడించే ప్రయత్నించడం, దానికి నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ నిర‌స‌న‌కు దిగ‌డం తెలిసిందే. ఇది ఉభయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ప‌రిస్థితిని మార్చేసింది. ఇక‌, స్థానికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నిత్యం మాటల యుద్ధం, ఘర్షణ వాతావరణం నడుస్తోంది.

ప‌ట్టు పోతుందా?

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో తన పట్టును నిరూపించుకుంటోంది. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, కేసీఆర్ నియోజకవర్గ కేంద్రాలైన ఈ రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం విశేషం. మొత్తంగా చెప్పాలంటే.. గజ్వేల్ నియోజకవర్గంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ల‌క్ష్యంగా రాజ‌కీయాలు చేస్తుండ‌గా.. బీఆర్ఎస్ మాత్రం అదే కేసీఆర్ కు ఇక్క‌డి ప్ర‌జ‌లు అండ‌గా ఉంటార‌ని న‌మ్ముతోంది.