టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో నాగ వంశీ ఒకరు. చింటూ అని సోషల్ మీడియా పెట్టుకున్న ముద్దుపేరుతో పాటు ఏదైనా సరే పెళుసుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారనే కామెంట్స్ కూడా ఈయన మీద వస్తుంటాయి. అఫ్కోర్స్ వాటిని పట్టించుకున్న దాఖలాలు తక్కువే కానీ గత వారం విడుదలైన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ విషయంలో ఆయన అనుసరించిన ధోరణి రియాలిటీకి దగ్గరగా ఉంటూ లేనిపోని అపోహలను దూరం చేసేలా ఉంది. ఈ సినిమా టాక్ ఏంటో ప్రీమియర్లతోనే బయట పడిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ డే ఒక సక్సెస్ మీట్ ఏదో కొంచెం హడావిడి చేశారు కానీ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎవరో ఒక స్టార్లను తీసుకొచ్చి ఈవెంట్లు చేసి లేనిపోని హైప్ చూపించే ప్రయత్నం చేయకుండా మూడో రోజే సైలెంట్ అయిపోవడం చూస్తే ఫలితం ఒప్పుకున్నట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మూడు రోజుల క్రితం వేసిన ట్వీట్లు తప్ప మళ్ళీ ఎపిక్ గురించి ఎలాంటి కబురు లేదు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య వాస్తవంలోకి వచ్చేసి సైలెంట్ అయిపోయారు.
ప్రస్తుతం నాగవంశీ ఆదర్శ కుటుంబం ఏకె 47 పనుల్లో యమా బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2 విడుదల తేదీ మారినట్టు ఇంకా ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ బయట ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. తాజాగా నివేత పేతురాజ్, డింపుల్ హయతి, శ్రీనిధి శెట్టిలతో సాంగ్ తీయడం చూస్తుంటే చివరి దశ షూట్ పీక్స్ మీద పరుగులు పెడుతున్నట్టు అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నా రిలీజ్ డేట్ మార్పు గురించి హారిక హాసిని వైపు నుంచి ఎలాంటి సౌండ్ లేదు.
ఎలాగైనా ఈ సినిమా గాంధీ జయంతికి విడుదల చేయాలనేది నాగవంశీ సంకల్పమట. ఎందుకంటే దసరా పండక్కు రణబాలి, జైలర్ 2తో క్లాష్ అయ్యి రెవిన్యూ పంచుకోవడం కన్నా రెండు వారాలు ముందు వచ్చి ఎక్కువ కాంపిటీషన్ లేని రన్ ఎంజాయి చేయొచ్చనేది ఆయన ఆలోచన. జైలర్ 2 వాయిదా పడే అవకాశాలు క్రమంగా తగ్గుతూ పోవడంతో ఆదర్శ కుటుంబంని రన్ రాజా రన్ అనిపిస్తున్నారట. టీజర్ వచ్చింది కానీ వెంకటేష్ ఫ్యాన్స్ మొదటి పాట కోసం వెయిట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates