హాట్ హాట్‌గానే.. తెలంగాణ పాలిటిక్స్‌!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గానే ఉన్నాయి. 22ఏ భూముల వివాదం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కాయి. ప్రస్తుత ప్రధాన పరిణామాలను గ‌మ‌నిస్తే.. రెండు వైపుల ప‌రిస్థితి వేడిగానే ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 22A నిషేధిత భూముల వివాదం, దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు వంటివి ఇరు ప‌క్షాల మ‌ధ్య దుమారాన్ని మ‌రింత పెంచాయి.

రాష్ట్రంలో సుమారు 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ భూములు 22A జాబితాలో చేరడంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ నడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ‌లు చేసిన ‘ధరణి పోర్టల్’ లోపాల వల్లే ఇది జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ హయాంలోనే నిషేధిత భూముల విస్తీర్ణం పెరిగిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇది అసెంబ్లీ వేదిక‌గా మాట‌ల యుద్ధానికి దారితీసింది. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదేస‌మ‌యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపైనా విచారణకు ఆదేశిస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయంగా మ‌రింత దుమారం రేగింది. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టుపక్కల ఉన్న 388 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమాలపై సిద్దిపేట జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం పేరుతో, అధికారంలోకి వచ్చాక వేల ఎకరాలు కూడబెట్టిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

అయితే.. బీఆర్ఎస్ నాయ‌కులు ఈ వాద‌న‌ను ఖండిస్తున్నారు. ప్రభుత్వ లీగల్ కమిటీల కంటే సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసురుతున్నారు. ఇక‌, స్పీకర్ ప్ర‌సాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని పేర్కొంటూ.. వారిపైనా విచార‌ణ కు ఆదేశించారు. మ‌రోవైపు.. ఎమ్మెల్సీలు టాటా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై న‌మోదైన కేసులు ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.

సెప్టెంబర్ 17 ‘విమోచన’ వర్సెస్ ‘ప్రజాపాలన’ దినోత్సవం కూడా.. రాజ‌కీయ దుమారానికి దారితీసింది. సెప్టెంబర్ 17 వేడుకల చుట్టూ కూడా రాజకీయ విభేదాలు నడిచాయి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు జరిపింది. ఈ వ్య‌వ‌హారం బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేల్చింది. మొత్తంగా చూస్తే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలా ఉన్నా.. రాజకీయ పార్టీల ఆధిప‌త్య ధోర‌ణులు మాత్రం కొన‌సాగుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.