రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండకి బేబీ మంచి పునాది వేసింది. అక్కడి నుంచి వేగంగా సినిమాలు చేస్తాడనుకుంటే రకరకాల కారణాల వల్ల కెరీర్ నెమ్మదిగా సాగుతోంది. గత వారం విడుదలైన ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ దారుణంగా ఫెయిల్ కావడం వెనుక అతను చేసిన రెండు పొరపాట్లున్నాయి. అవే ఇప్పుడీ ఊహించని డిజాస్టర్ కు కారణంగా నిలుస్తున్నాయి.

మొదటిది చెన్నై లవ్ స్టోరీని వదులుకోవడం. ఆనంద్, వైష్ణవి చైతన్య కాంబోనే కథకుడు కం నిర్మాత సాయి రాజేష్ ముందు అనుకున్నది. ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. తర్వాత రకరకాల కారణాల వల్ల ఇద్దరూ ఒకేసారి తప్పుకుని సితార బ్యానర్ నుంచి వచ్చిన దర్శకుడు ఆదిత్య హాసన్ కు ఓటేశారు. 90స్ మిడిల్ క్లాస్ తీసిన బ్రెయిన్ కావడంతో వెండితెర డెబ్యూని గొప్పగా రాసుకుని ఉంటాడనే ఉద్దేశంతో ఎస్ చెప్పారు. లెక్క పూర్తిగా తప్ప పరీక్షలో బోల్తా కొట్టారు.

నిజానికి ఎపిక్ అనుకున్నది నితిన్ తో. కొన్ని ప్రాధమిక చర్చలు జరిగాయి, ఒక దశలో ఓకే అనుకున్నారు. కానీ తర్వాత ఎక్కడో మిస్ ఫైర్ అయిపోయి నితిన్ ఇది వద్దనుకున్నాడు. ఇంత ఘాడమైన లివిన్ ప్రేమకథలో తనను ఆడియన్స్ చూడకపోవచ్చనే అనుమానం వెనక్కు లాగిందని వినికిడి. దీంతో ఆ అవకాశం కాస్తా ఆనంద్ దేవరకొండ చెంతకు చేరింది. ఇది ఎంత పెద్ద తప్పిదమో బాక్సాఫీస్ సాక్షిగా రుజువైపోయింది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేదు.

ఆనంద్ చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అవి టైం ప్రకారం రావడం లేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన వినోద్ అనంతజు కలయికలో తక్షకుడు అనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ నెట్ ఫ్లిక్స్ కోసం చేశాడు. దాని గురించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అయిపోయిందో లేదో బయటికి చెప్పడం లేదు. టీజర్ వచ్చి ఏడు నెలలు దాటిపోయింది. ప్రామిసింగ్ గా అనిపించింది కూడా. కానీ ఎందుకు జాప్యం జరుగుతోందో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక. దీని నిర్మాత కూడా సితార సంస్థే కావడం ఫైనల్ ట్విస్ట్.