పాపం వైఎస్ వివేకా కూతురు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సోద‌రుడు, ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి త‌న స్వ‌గృహంలో దారుణంగా హ‌త్య‌కు గురై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. ముందు వివేకా గుండెపోటుతో చ‌నిపోయాడ‌ని సాక్షి మీడియాలో వార్త‌లు రావ‌డం.. కొన్ని గంట‌ల త‌ర్వాత ఆయ‌న‌ది దారుణ హ‌త్య అని తేల‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

హ‌త్య జ‌రిగిన‌పుడు ఉన్న‌ది తెలుగుదేశం ప్ర‌భుత్వం. కాబ‌ట్టి జ‌గ‌న్ అండ్ కో ఏమీ చేయ‌లేక‌పోయింది అనుకుందాం. ఆ హ‌త్య టీడీపీ వాళ్లే చేయించార‌ని కూడా జ‌గ‌న్ ఆరోపించాడు. ఐతే రెండు నెల‌లు తిరిగే స‌రికి జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఈ హ‌త్యకు బాధ్యులెవ‌రు.. అస‌లేం జ‌రిగింది అన్న‌ది తేల్చ‌లేక‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

త‌న సొంత బాబాయి హ‌త్య కేసును ఛేదించే విష‌యంలో సీఎం జ‌గ‌న్ ఎందుకు చొర‌వ చూప‌ట్లేదు.. పోలీస్ విభాగంపై ఎందుకు ఒత్తిడి తేవ‌ట్లేదు అన్న‌ది ఆయ‌న అభిమానుల‌కే అర్థం కావ‌డం లేదు. త‌న అన్న ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా.. తండ్రి హ‌త్య కేసు విష‌యంలో న్యాయం కోసం వివేకా త‌న‌యురాలు సునీతా రెడ్డి ఒంట‌రిగో పోరాడాల్సి రావ‌డం, కోర్టుల‌తో పాటు వేరే మార్గాల ద్వారా త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాల్సి రావ‌డం విచారించాల్సిన విష‌యం.

తాజాగా ఆమె ఈ కేసు విష‌య‌మై కేర‌ళ‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ‌లో సంచ‌ల‌నం రేపిన సిస్ట‌ర్ ఆచార్య కేసు విష‌యంలో అలుపెర‌గ‌ని పోరాటం చేసిన జోమ‌న్ పుదన్ పుర‌క్క‌ల్ అనే సామాజిక వేత్త‌ను సునీతా రెడ్డి క‌లిశారు. ఆయ‌న‌తో సునీత స‌మావేశ‌మైన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. త‌న అన్న‌య్య ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా.. తండ్రి హ‌త్య కేసుకు సంబంధించి వేరే రాష్ట్రానికి వెళ్లి ఎవ‌రెవ‌రినో క‌ల‌వాల్సి రావ‌డం చూసి సునీత‌పై జాలి ప‌డాల్సిందే. దీనికి వైసీపీ మ‌ద్దతుదారులైనా ఏం స‌మాధానం చెబుతారో?