ఈ సీనియర్ నేతను గురించి అందరు ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకపుడు ఐదేళ్ళపాటు జిల్లా మొత్తం మీద బ్రహ్మాండంగా ఓ వెలుగు వెలిగిన ఈ నేత హఠాత్తుగా ఎవరికీ కనబడటం లేదు, ఎక్కడా వినబడటం లేదు. గడచిన ఏడాదిన్నరగా అయితే అసలు ఈ నేత గురించి జిల్లాలోని రాజకీయ జనాలు దాదాపు మరచిపోయినట్లే ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటారా అదే శిద్దా రాఘవరావు గురించే ఇదంతా.
2004 ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శిద్దా మొదటిసారే ఒంగోలు అసెంబ్లీకి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేశారు. అప్పటికే ఉన్న సీనియర్లను కాదని చంద్రబాబునాయుడు శిద్దాను బాగా ఎంకరేజ్ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత శిద్దా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 2009లో ఎంఎల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. మళ్ళీ 2014లొ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.
వైస్య సామాజికవర్గానికి చెందిన శిద్దాగా ఆర్ధికంగా కూడా మంచిస్ధితిలోనే ఉన్నారు. దాంతో ఆయన్ను ఏకంగా మంత్రివర్గంలోకే తీసుకున్నారు. అలా ఐదేళ్ళపాటు జిల్లాలో బ్రహ్మాండంగా వెలిగిపోయారు. 2019 వచ్చేసరికి ఒంగోలు అసెంబ్లీకి కాకుండా ఎంపిగా పోటీ చేయించారు. ఎంపిగా పోటీ చేయనని శిద్ధా ఎంతగా మొత్తుకున్నా అప్పటి అవసరాలని చెప్పి చంద్రబాబు బలవంతంగా నామినేషన్ వేయించారు ఎంపిగా. అయితే వైసీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయారు.
దానికితోడు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో చేసేది లేక పార్టీలోనే స్తబ్దుగా ఉండిపోయారు. అయితే తర్వాత వ్యాపారాల్లో వచ్చిన ఒత్తిళ్ళ వల్ల చివరకు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. పార్టీలో చేరేముందే శిద్ధాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తండ్రి, కొడుకుల రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి వాళ్ళేమడిగారో ? జగన్ ఏమి హామీ ఇచ్చారో మూడోవ్యక్తికి తెలీదు. కానీ వైసీపీలో చేరిందగ్గర నుండి శిద్దా కుటుంబం ఎక్కడా కనబడటం లేదు, వినబడటం లేదు.
పార్టీలు మారిన వాళ్ళకు కూడా జగన్ ఏదో విధంగా అకామిడేట్ చేశారు. పైగా వైస్య సామాజికవర్గానికి చెందిన నేత, అందులోను ఆర్ధికంగా బాగా గట్టిస్ధితిలో ఉండటంతో శిద్దాకు తిరుగుండదని అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా రివర్సులో నడుస్తోంది ఆయన గ్రాఫ్. ఈ నేత కూడా బాగా చొరవున్న వారే అనటంలో సందేహం లేదు. మరి ఎక్కడ తేడా వచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఎంతో భవిష్యత్తుందని అందరు అనుకున్న నేత చివరకు ఎవరికీ కాకుండా పోతున్నారని ఇపుడు జిల్లాలో టాక్.